
దేశ వ్యాప్తంగా దిశ ఘటనకు సంబంధించి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాల సీఎంలు మహిళల భద్రతలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించబోమని అన్ని స్కూళ్లలోని మగపిల్లలతో ప్రతిజ్ఞ చేయించాలని నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటున్న మగ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలని తాను, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నిర్ణయించినట్లు ఫిక్కీ సమావేశంలో కేజ్రీవాల్ తెలిపారు. ఆడపిల్లల పట్ల తప్పుడుగా ప్రవర్తించబోమని మగపిల్లలందరూ అనుకోవాలని… అదే విధంగా ఆడపిల్లలను వేధిస్తే ఇంట్లోకి రానివ్వబోమని తల్లులు కూడా తమ కుమారులకు చెప్పాలని కేజ్రీవాల్ సూచించారు.