- స్టూడెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్కూల్ యాజమాన్యాలు
- కరోనా వల్ల రెండేండ్లుగా ఫిట్‌నెస్‌కు దూరం అయిన బడి బస్సులు
- ఫిట్‌నెస్ వ్యాలిడిటీ ముగిసినప్పటి నుంచి రోజుకు రూ.50 లేట్ ఫీజు
- లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి రావడంతో టెస్టులకు
- ముందుకురాని స్కూళ్ల మేనేజ్‌మెంట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్కూళ్లు తెరుచుకున్నాయి. రోడ్లపై బడి బస్సులు పరిగెత్తున్నాయి. కానీ, ఆ బస్సుల్లో భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు కారణం రాష్ట్రంలోని చాలా స్కూల్ మేనేజ్‌మెంట్లు తమ బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించలేదు. ఇన్నాళ్లు షెడ్లకే పరిమితమైన బస్సులు.. స్కూళ్లు తెరుచుకోవడంతో రోడ్లపైకి వచ్చాయి. ఆర్టీఏ రూల్స్ ప్రకారం, ఏటా స్కూల్ బస్సులకు పిట్‌నెస్ పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి. కానీ ఆయా స్కూల్ యాజమాన్యాలు ఇందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీంతో ఫిట్‌నెస్ లేని బస్సులతో స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఫీజుల భారంతో ముందుకు రావట్లే..
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 వేల స్కూల్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులకు ఫిట్‌నెస్ గడువును మే నెలలో రెన్యువల్ చేసుకోవాలి. ఏటా సమ్మర్‌లో స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. కరోనాతో రెండేండ్లుగా స్కూళ్లు నడవకపోవడంతో ఫీజులు పెద్దగా వసూలు కాలేదు. దీంతో యాజమాన్యాల దగ్గర పైసల్లేక బస్సులకు ఫిట్‌నెస్ రెన్యువల్ టెస్టులు చేయించుకోలేదు. మరోవైపు ఫిట్‌నెస్ రెన్యువల్ చేయించుకోకపోతే ప్రభుత్వం భారీగా పెనాల్టీలు విధిస్తోంది. బండ్లకు ఫిట్‌నెస్ వ్యాలిడిటీ ముగిసినప్పటి నుంచి రోజుకు రూ.50 చొప్పున ఫైన్ వేస్తోంది. చాలా బస్సులు రెండేండ్ల నుంచి ఫిట్‌నెస్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో ఒక్కో బస్సు రూ.వేల నుంచి రూ.లక్షల్లో లేట్ ఫీజు చెల్లించాల్సి వస్తుండటంతో స్కూల్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో లేట్ ఫీజు నిబంధన ఎత్తేయాలని కోరుతున్నాయి. ఇప్పటికే ఆటో, క్యాబ్, ట్రావెల్స్, లారీ సంఘాల జేఏసీ నేతలు ఆందోళనలు చేపట్టారు. దీంతో లేట్ ఫీజు తగ్గింపుపై ఆర్టీఏ ఉన్నతాధికారులు సర్కార్‌కు పలు ప్రతిపాదనలు పంపినా.. అక్కడి నుంచి ఇంకా ఆమోదం రాలేదు. దీంతో ఫిట్‌నెస్ టెస్టులు చేయించుకోకుండా యజమానులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
రూల్స్ పాటించకుండానే రోడ్లపైకి..
ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లలో చాలా మందికి డ్రైవింగ్ లైసెన్స్‌లు లేవని ఆరోపణలు ఉన్నాయి. రూల్ ప్రకారం లైసెన్సు లేని వారిని డ్రైవర్లుగా నియమించవద్దు. గతంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే గేటు వద్ద జరిగిన ప్రమాదంలో అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఆయా స్కూల్ యాజమాన్యాలు ఆటోలు, టాటా మ్యాజిక్‌లను వినియోగిస్తున్నాయి. వీటిల్లో 20 మందికిపైగా స్టూడెంట్లను కుక్కి తరలిస్తున్నారు. మరోవైపు స్కూల్ బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ఎక్కడా కనిపించడం లేదు. ఇక స్కూల్స్ రీఓపెన్ టైంలో ఆర్టీఏ ఆధ్వర్యంలో ఫిట్‌నెస్‌పై నిర్వహించే అవగాహన కార్యక్రమాలు, ఫిట్‌నెస్ రెన్యువల్ కోసం స్పెషల్ డ్రైవ్‌లు ఇంకా చేపట్టలేదు.
స్కూల్ బస్సుల్లో భద్రతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
- బస్సు ముందు, వెనక భాగాల్లో ‘స్కూల్ బస్సు’, ‘ఆన్ స్కూల్ డ్యూటీ’అని రాయాలి.
- బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉండాలి.
- బస్సు ఇంజన్ కంపార్ట్‌మెంట్‌లో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉండాలి.
- బస్సు కిటికీలకు నెట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
- బస్సు తలుపులకు లాకింగ్ సిస్టమ్ పెట్టాలి.
- విద్యార్థులు తమ బ్యాగ్‌లను ఉంచేందుకు బస్సులోనే విడిగా స్థలం కేటాయించాలి.
- బస్సుల్లో పిల్లల సాయం కోసం అటెండర్‌ను నియమించాలి.
- గంటకు 40 కిలోమీటర్ల వేగం మించకుండా స్పీడ్ గవర్నెన్స్ ఏర్పాటు చేయాలి.
- డ్రైవర్‌కు లైసెన్స్‌తో పాటు కనీసం నాలుగేండ్ల అనుభవం ఉండాలి
