5వ తరగతి ఒక్క టెక్స్ట్‌బుక్ రూ.1035.. రేటు చూసి నోరెళ్లబెడుతున్న పేరెంట్స్

5వ తరగతి ఒక్క టెక్స్ట్‌బుక్  రూ.1035.. రేటు చూసి నోరెళ్లబెడుతున్న పేరెంట్స్

ఈరోజుల్లో చదువు అనేది ఒక సేవగా కాకుండా.. భారీ లాభాలను ఆర్జించే వ్యాపారంగా మారిపోయింది. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, స్టేషనరీ వస్తువుల రేట్లు సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులను షాక్ కి గురిచేస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో దేశంలోని స్కూల్స్ అడ్డగోలు దోపిడీని మరోసారి ఎండగట్టింది.

ఒక్క పుస్తకం ధర రూ.1,035
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఒక ప్రముఖ పాఠశాల (సిటీ మాంటిస్సోరి స్కూల్)కు సంబంధించిన క్లాస్ 5 ఇంగ్లీష్ టెక్స్ట్‌బుక్ ధర చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కేవలం ఐదో తరగతి చదివే చిన్నారి పుస్తకం ధర ఏకంగా రూ.1,035 ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై ఒక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఒక్క పుస్తకమే వెయ్యి రూపాయలు దాటితే, ఇక పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? దీనిపై మాట్లాడితే మతం ప్రమాదంలో పడుతుందంటారు, కానీ నిజానికి మన పిల్లల చదువులే ప్రమాదంలో ఉన్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తల్లిదండ్రుల ఆవేదనకు అద్దం పడుతున్నాయి.

ఎంబీబీఎస్ పుస్తకాల కంటే ఖరీదు
ఈ ధరలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తాను చదివే ఎంబీబీఎస్ స్టాండర్డ్ బుక్స్ ధర కూడా దీనికంటే తక్కువగా ఉంటుందన్నారు. బహుశా ఈ స్కూల్ బుక్స్‌లో వేరే గ్రహాలకు సంబంధించిన జ్ఞానం ఏమైనా ఉందేమో అంటూ ఒక వైద్య విద్యార్థి ఎద్దేవా చేశారు. అసలు రూ.50 నుంచి రూ.100 లోపు ప్రింటింగ్ ఖర్చు అయ్యే పుస్తకానికి రూ.వెయ్యికి పైగా వసూలు చేయడం ఏ రకమైన విద్యా విధానమని నెటిజన్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశ్నిస్తున్నారు.

అహ్మదాబాద్‌లోనూ అదే పరిస్థితి
ఈ దోపిడీ కేవలం లక్నోకే పరిమితం కాలేదు. గురుగ్రామ్‌లో ఒక పేరెంట్ తన కూతురి UKG పుస్తకాలు, స్టేషనరీ కోసం ఏకంగా రూ. 6,125 చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. అహ్మదాబాద్‌లో ఒకటో తరగతి విద్యార్థి పుస్తకాల సెట్ ధర రూ.4వేలు దాటిపోయింది. బయట మార్కెట్‌లో తక్కువ ధరకే దొరికే అవకాశం ఉన్నా.. స్కూళ్లు మాత్రం తమ వద్దే కొనాలని నిబంధనలు పెడుతూ కమీషన్ల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

8వ తరగతి వరకు పాఠశాలలు సొంత సిలబస్‌ను అనుసరించేందుకు ప్రభుత్వం అనుమతించడం ప్రైవేట్ స్కూళ్లకు వరంగా మారింది. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను పక్కన పెట్టి.. ప్రైవేట్ పబ్లిషర్లతో టై-అప్ పెట్టుకుని అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి పుస్తకాల సెట్ ధర రూ.8వేల వరకు ఉంటోంది. దీనికి అదనంగా ట్యూషన్ ఫీజులు, యూనిఫాంలు, ఇతర ఛార్జీలు కలపడంతో విద్యాభ్యాసం సామాన్యులకు కష్టతరం అవుతోంది. ఇంత జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.