మాల వేసుకున్నావా.. 41 రోజులు బడికి రాకు

మాల వేసుకున్నావా.. 41 రోజులు బడికి రాకు

స్టూడెంట్‌‌ను ఇంటికి పంపిన యాజమాన్యం

స్కూల్​ ఎదుట స్వాముల ధర్నా

యాదాద్రి, వెలుగు: అయ్యప్ప మాల వేసుకున్న స్టూడెంట్​ను 41 రోజులు బడికి రావద్దంటూ పంపించిన ఘటన యాదాద్రి జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. విషయం తెలుసుకున్న వీహెచ్‌‌పీ, భజరంగ్​దళ్​ప్రతినిధులు, అయ్యప్ప స్వాములు స్కూల్​వద్ద ధర్నాకు దిగారు. జిల్లా కేంద్రంలోని ఇండియా మిషన్​ స్కూల్​లో పట్టణానికి చెందిన శివారెడ్డి కుమారుడు ప్రణీత్​రెడ్డి నాలుగో తరగతి చదువుతున్నాడు. వచ్చే నెలలో శబరిమలై వెళ్లడానికి ప్రణీత్​రెడ్డి అయ్యప్పమాల వేసుకున్నాడు. మాల వేసుకున్న స్టూడెంట్​స్కూల్​కు రావడంతో టీచర్ మాల ధరించిన 41 రోజులు రావద్దని పంపించివేశారు. దీంతో ప్రణీత్​ ఇంటికి వెళ్లిపోయాడు. హిందూ సంస్థలు దీనిపై మధ్యాహ్నం  స్కూల్​ఎదుట ఆందోళనకు దిగాయి. కరస్పాండెంట్​జుడాతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో  కొందరు కరస్పాండెంట్​ రూంలోకి వెళ్లి కుర్చీలను పక్కకు పడేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి సర్దిచెప్పడానికి ప్రయత్నించినా స్వాములు వినలేదు. అదే సమయంలో ఒక స్టూడెంట్​తల్లి అక్కడకు వచ్చారు. ఫీజు చెల్లించడంలో కాస్త ఆలస్యం చేసినందుకు కరస్పాండెంట్​ తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. విషయం తెలుసుకున్న జిల్లా ప్రైవేట్​స్కూళ్ల యూనియన్​ తరఫున కరస్పాండెంట్లు బండిరాజుల శంకర్, విజయ్​కుమార్​ అక్కడకు చేరుకొని చర్చలు జరిపారు. కరస్పాండెంట్​ క్షమాపణ చెప్పాలని, ప్రణీత్​రెడ్డి తరగతులకు హాజరు కావడానికి ఒప్పుకుంటేనే తాము ఆందోళన విరమిస్తానని స్వాములు తేల్చి చెప్పారు. కరస్పాండెంట్​ జుడా అయ్యప్ప స్వాములను క్షమాపణ కోరడంతో పాటు స్టూడెంట్ ​తరగతులకు హాజరు కావచ్చని చెప్పారు. దీంతో స్వాములు ఆందోళన విరమించారు.