నిర్మల్: భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కుమ్రం భీమ్ జిల్లాలో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా డీఈఓ సెలవు ప్రకటించారు.
నిర్మల్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కారణంగా వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. నిర్మల్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. ఇప్పటికే ప్రస్తుత నీటిమట్టం 691.675 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 3.495 టీఎంసీలు.
ప్రస్తుతం నీటి నిల్వ 1.867 టీఎంసీలు. కడెం ప్రాజెక్ట్ ఆయకట్టు కింద 68 వేల 150 ఎకరాలను రైతులు సాగు చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ వర్షాల కోసం పూజలు చేసిన ప్రజలు భారీ వర్షాలు కురవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కడెం ప్రాజెక్ట్:
* ఇన్ ఫ్లో: 21,040 క్యూసెక్కులు
* ఔట్ ఫ్లో: 67 క్యూసెక్కులు
* ప్రాజెక్టు ఆయకట్టు : 68150 ఎకరాలు
