ఎండల తీవ్రతకు ​స్కూళ్లకు వారం సెలవు

ఎండల తీవ్రతకు ​స్కూళ్లకు వారం సెలవు

కోల్​కతా: వేడి గాలులు, తీవ్రమైన ఎండల కారణంగా బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి వారం వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. కొద్ది రోజులుగా స్కూలు నుంచి ఎండలో ఇంటికి తిరిగి వెళ్లాక పిల్లలు తలనొప్పితో బాధపడుతున్నట్లు పేరెంట్స్ కంప్లైంట్ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకూ సెలవులు ప్రకటించాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.

వేడి గాలులు, ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని అమలుచేయాలని ఆదేశించారు. తదుపరి నిర్ణయం తీసుకునే దాకా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. అయితే, కొండ ప్రాంతాల్లో ఉన్న డార్జిలింగ్, కలింపోంగ్  వంటి జిల్లాలకు మినహాయింపు ఇచ్చినట్లు సీఎం చెప్పారు. ప్రజలు కూడా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు వెళ్లవద్దని సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.