బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.యూసుఫ్ డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ అనుబంధం) పిలుపు మేరకు వంట కార్మికులు సోమవారం భారీ సంఖ్యలో హాజరై లక్డికాపూల్లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
అనంతరం ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24 ఏండ్లుగా వంట కార్మికులు సొంత ఖర్చులతో భోజనాలు వండి, విద్యార్థులకు అందిస్తున్నప్పటికీ సరైన గౌరవ వేతనం లేకపోవడం బాధాకరమన్నారు. పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉండడంతో వంట పనులు సాగించడం కష్టమవుతోందన్నారు.
ఈ ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్ పావని, జంపాల రవీందర్ పాల్గొన్నారు.
