మణిపూర్ లో స్కూళ్లు రీ ఓపెన్

మణిపూర్ లో  స్కూళ్లు రీ ఓపెన్

ఇంఫాల్: రాష్ట్రంలో 1 నుంచి 8 వ తరగతుల స్కూళ్లను బుధవారం నుంచి తిరిగి తెరవనున్నట్లు మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ప్రకటించారు. పారామిలటరీ, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మైతీ, కుకీ తెగల మధ్య గొడవలు మొదలై రెండు నెలలు గడిచాయి. హింస ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తుంగా ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు మూతపడ్డాయి. ప్రస్తుతం అల్లర్లు కాస్త తగ్గడంతో తిరిగి ఓపెన్ చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. అలాగే, వ్యవసాయ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేలా రైతులకు అదనపు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. ఆందోళనలు జరిగే అవకాశమున్న ఐదు జిల్లాల్లో అదనపు సిబ్బందిని మోహరించాలని సూచించారు. రెండు నెలల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 120 మంది ప్రాణాలు కోల్పోగా, 3 వేల మందికిపైగా గాయపడ్డారు.