సంక్రాంతి సంబురాలు.. ముగ్గులు ఎందుకు వేస్తారంటే...

సంక్రాంతి సంబురాలు.. ముగ్గులు ఎందుకు వేస్తారంటే...

రోజూ ఇంటి ముందు వేసే ముగ్గులకు సంక్రాంతి ముగ్గులకు తేడా ఉంటుంది. పాత రోజుల్లో  మట్టి ఇళ్లు ఎక్కువగా ఉండేవి. ఆ ఇళ్లను శుభ్రంగా ఊడ్చి, పేడతో అలికేవాళ్లు. ఆ తర్వాత మెలికలు, గీతలు, చుక్కలతో తెల్లటి ముగ్గులు వేసేవాళ్లు. తరువాత వాటికి ఒక పద్ధతిలో రంగులు దిద్దితే అందంగా మెరిసిపోయేవి వాకిళ్లు. రకరకాలుగా మారిన పరిస్థితుల్లో ఆనాటి ముగ్గులు ఇప్పుడు ఏ రూపంలో అలరిస్తున్నాయంటే... 

ముగ్గుల్ని ‘రంగోలి’ అని కూడా అంటారు. ‘రంగోలి’ అనేది సంస్కృత పదం ‘రంగవల్లి’ నుంచి వచ్చింది. ‘రంగ్​’ అంటే ‘రంగు’, ‘అవల్లి’ అంటే ‘వరుసలు, గీతలు’ అని అర్థం. ఇంటి ముందు ముగ్గు పెడితే మంచి జరుగుతుందని, ఇంట్లోకి అతిథులకు ఆహ్వానించడానికి గుర్తు అని చెప్తుంటారు. ముఖ్యంగా  సిరిసంపదలనిచ్చే లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు భావిస్తారు.

నిజానికి ముగ్గు వేయడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. పూర్వం రోజుల్లో ప్రతి రోజూ వాకిలిలో బియ్యప్పిండితో ముగ్గులు వేసేవాళ్లు. ఆ పిండిని పశువులు, పక్షులు తినేవి. అలా మూగజీవాల ఆకలి కొంత తీర్చినట్టు అయ్యేది. అలాగే మనుషులకు, మూగజీవాలకు మధ్య ఒక అనుబంధం ఏర్పడేది.

మూగ జీవాల ఆకలి తీరడంతో పాటు ముగ్గు వేసిన వాళ్లకు మంచి ఎక్సర్​సైజ్​ కూడా దొరికేది. వంగి ముగ్గులు వేయడం వల్ల పొద్దున్నే శరీరానికి వ్యాయామం అందించినట్టు అవుతుంది. రకరకాల ముగ్గులు వేయడం వల్ల క్రియేటివిటీకి పదును పెట్టినట్టు అవుతుంది. 

సైంటిఫిక్ రీజన్​

ముగ్గుల్లో చుక్కలు, మెలికలు, గీతలు అని రకాలు ఉంటాయి. వీటి వెనక కూడా ఒక సైంటిఫిక్​ రీజన్ ఉందట! అదేంటంటే.. జియోమెట్రిక్ ప్యాటర్న్​ని చూస్తే మైండ్​లో వైబ్రేషన్స్ వచ్చి, దాన్ని అబ్జర్వ్ చేసే కొద్దీ మైండ్ రిలాక్స్​ అయిపోతుంది. దీన్నే ఇంగ్లిష్​లో సూతింగ్ ఎఫెక్ట్ అంటారు. ఇక ముగ్గులకు వాడే రంగుల్లో... తెలుపు స్వచ్ఛతకు, ఎరుపు బలానికి

పసుపు సంపదకు, ఆకుపచ్చ సామరస్యానికి, కాషాయం త్యాగానికి, నీలం రంగు ఆనందానికి గుర్తు. ఈ సంపదలన్నీ ‘మా ఇంటికి రావాల’ని ముగ్గులతో సంక్రాంతి పండుగ నాడు ఆహ్వానం పలుకుతారన్నమాట.