పాపం బతుకుదెరువు కోసం కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి ఓ గోల్డ్ షాపులో పనిచేసుకుంటున్నారు. ఎప్పటిలాగే పనులు ముగించుకుని.. చిన్న షాపింగ్ ఏదో చూసుకుని శనివారం (ఏప్రిల్ 04) రాత్రి ఇంటికి వెళ్తున్న వారిని డీసీఎం రూపంలో విధి వెంటాడింది. స్కూటీని ఢీకొట్టడమే కాకుండా కిలోమీటరు దూరం ఈడ్డుకెళ్లడంతో ఘోరం జరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ విషాద ఘటన. రాత్రి మాదాపూర్ మైండ్ స్పేస్ సమీపంలో స్కూటిపై వెళ్తున్న దంపతులను డీసీఎం ఢీకొట్టింది. స్కూటి డీసీఎం కింద ఇరుక్కున్నప్పటికీ.. ఆపకుండా కిలోమీటర్ వరకు ఇడ్చుకెళ్లాడు డీసీఎం డ్రైవర్. గమనించిన స్థానికులు అడ్డుకోవడంతో డ్రైవర్ పారిపోయాడు. డీసీఎం క్లీనర్ ను అదుపులోకి తీసుకుని చితకబి స్థానికులు.. పోలిసులకు అప్పగించారు.
తీవ్రంగా గాయపడిన దంపతులను హాస్పిటల్ కు తరలించారు. హనియ్యా ఆయేషా (22) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. హనియ్యా ఆయేషా భర్త అబ్దుల్ బాసిత్ హస్పటల్ లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.
కేరళకు చెందిన దంపతులు సిటీలోని మహేశ్వరం సమీపంలో ఉంటూ ఇద్దరూ మలబార్ గోల్డ్ జువెలరీ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి హాస్పిటల్ కు తరలించారు.
