తెలంగాణలో నేడు( నవంబర్ 13) నామినేషన్ల పరిశీలన

 తెలంగాణలో నేడు( నవంబర్ 13) నామినేషన్ల పరిశీలన

తెలంగాణలో 2023 నవంబర్ 13న  నామినేషన్ల పరిశీలన జరగనుంది.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 4 వేల 798 మంది 5 వేల 716 నామినేషన్లు దాఖలు చేశారు.  అత్యధికంగా గజ్వేల్‌లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు చేశారు.  అత్యల్పంగా నారాయణపేటలో 13 మాత్రమే నామినేషన్లు  దాఖలయ్యాయి.  

ఒక్కో అభ్యర్థి కనీసం రెండు సెట్ల నామినేషన్ల దాఖలు చేశారు.   మొదటి నుంచి టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టిన ఎలక్షన్ కమిషన్..  రూల్స్ ప్రకారం ఏ చిన్న తప్పు ఉన్నా  తిరస్కరించనుంది. దీంతో ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి అనేది రేపు తేలనుంది.  నవంబర్ 15 వ తేదీన  నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. ఇక నవంబర్ 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది. 

 ఈ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా కీలకంగా తీసుకున్నాయి.  ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ భావిస్తుంటే..  బీఆర్ఎస్ ను ఓడించి మొదటిసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి.  ఈ  ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుండగా,  ఎంఐఎం తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తూ..  మిగిలిన స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తోంది. 

ఇక కాంగ్రెస్..  118 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తూ..  ఒక సీటును మిత్రపక్షమైన సీపీఐకి అప్పగించింది.  మరోవైపు బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తూ..  దాని మిత్రపక్షమైన జనసేన పార్టీకి ఎనిమిది స్థానాలను అప్పగించింది.