రాతిని తొలిచి మలిచిన ఆలయ పునాదుల గుర్తింపు

రాతిని తొలిచి మలిచిన ఆలయ పునాదుల గుర్తింపు

హనుమకొండ జిల్లా పెద్దాపూర్​లో వెలుగులోకి

హనుమకొండ/ఆత్మకూరు, వెలుగు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్​లో కాకతీయుల కంటే ముందు కాలానికి చెందిన వెయ్యేండ్ల కిందటి శిల్పాలను గుర్తించామని ప్లీచ్​ ఇండియా ఫౌండేషన్​ సీఈవో, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన చరిత్ర పరిశోధకుడు డాక్టర్ రాచర్ల గణపతి ఇచ్చిన సమాచారంతో హెరిటేజ్​ వరంగల్ ఏడీ మల్లు నాయక్.. కన్జర్వేషన్​ ఆర్కిటెక్ట్​ శ్రీలేఖతో కలిసి ఆదివారం పెద్దాపూర్​ పొలిమేరలోని రామప్ప గుట్ట వద్ద ఉన్న శిల్పాలు, ఆలయ శిథిలాలను పరిశీలించినట్లు శివనాగిరెడ్డి తెలిపారు. గుట్ట కింద క్రీ.శ. 8-90వ సంవత్సరానికి చెందిన శివలింగం, నంది, మరో నందిపీఠం, రాతిని తొలిచి మలిచిన ఆలయ పునాదులను గుర్తించామని చెప్పారు. గుట్టకు రెండు వైపులా చెక్కిన మెట్లు, లజ్జగౌరి(అమ్మతల్లి) విగ్రహం, గుట్టపైన రాష్ట్ర కూటుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయం, కాకతీయుల కాలం నాటి రంగమండపం, నందిమండపం ఉన్నాయన్నారు.

ఆలయ అర్ధ మండప స్తంభంపై క్రీ.శ 1,1-12వ శతాబ్దం నాటి తెలుగు శాసనంలో రామేశ్వరం మాధవరాజు దామెర చెరువు కింద ఉన్న మాగాణి, రేగడు భూమిని ఆలయానికి దానం చేసిన వివరాలు ఉన్నాయని వివరించారు. చారిత్రక ఆధారాలను బట్టి పెద్దాపూర్​ను ఆ రోజుల్లో రామేశ్వరమని పిలిచేవారని, దేవుని పేరు కాబట్టి  రామప్ప అని కూడా పిలిచారని పేర్కొన్నారు. ఈ ఆధారాలన్నీ జిల్లాలో మరో రామప్ప ఆలయ ఉనికిని తెలియజేశాయన్నారు. శిల్పాలు, శాసనాల ప్రాముఖ్యతను సర్పంచ్ సావురె కమలారాజేశ్వరరావు, స్థానిక నాయకులు వంశీ గౌడ్, కుమారస్వామి, ఇతర గ్రామస్థులకు శివనాగిరెడ్డి వివరించారు. ఇలాంటి వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.