
కోరుట్ల(మెట్‌పల్లి), వెలుగు: వినియోగదారులు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని ఎస్ఈ బి.సుదర్శనం సూచించారు. మంగళవారం మెట్‌పల్లిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఆవశ్యకతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడకు భూమిపై ఉష్ణతాపం తగ్గించాలన్నారు.
బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పర్యావరణ హితమైన సోలార్ ఇంధన ఉత్పత్తి వైపు దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రస్తుత విద్యుత్ అవసరాలకు థర్మల్ స్టేషన్ల ద్వారా సింహభాగం ఉత్పత్తి జరుగుతోందని, బొగ్గు మండించడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం-సూర్య ఘర్ యోజన, పీఎం-కుసుమ్ యోజన పథకాలను వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో మెట్‌పల్లి డీఈ మధుసూదన్, ఏడీఈ మనోహర్, లీడర్లు విష్ణు, లింబాద్రి, రాజేందర్, పౌల్ట్రీ పరిశ్రమ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, వెల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సలీం, వ్యాపారులు పాల్గొన్నారు.