ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు .. కామారెడ్డి జిల్లాలో 2 నెలల్లో 31 డెంగ్యూ కేసులు

ప్రబలుతున్న సీజనల్ వ్యాధులు .. కామారెడ్డి జిల్లాలో 2 నెలల్లో 31 డెంగ్యూ కేసులు
  • 5 పీహెచ్​సీల పరిధిలోనే అత్యధిక కేసులు
  • తాడ్వాయి మండలంలో తాజాగా డయేరియా

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. 2  నెలల్లోనే   31 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.  ఇందులో 5 పీహెచ్​సీల పరిధిలోనే అధికంగా ఉన్నాయి.  తాజాగా తాడ్వాయి మండలంలో డయేరియా సోకింది. పరిసరాల అపరిశుభ్రత, ఇండ్లు, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ,  కలుషిత నీరు,  వాతావరణ పరిస్థితులతో వ్యాధులు సోకుతున్నాయి.  

డెంగ్యూ నిర్ధారణ అయిన పీహెచ్​సీలు.. 

జిల్లాలోని పలు ఏరియాల్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. కామారెడ్డి టౌన్​తో పాటు, పలు మండలాల్లోని తండాలు, గ్రామాల్లో జ్వరపీడితులు అధికమవుతుండగా, కొందరికీ డెంగ్యూ సోకింది.  జూన్​, జూలైలో ఇప్పటి వరకు  31 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.  జూన్​లో 17,  ఈ నెల ఇప్పటి వరకు 14 కేసులు వచ్చాయి.  పీహెచ్​సీ స్థాయిల్లో శాంపిల్స్ సేకరించి టీ హబ్​లో టెస్టులు చేయగా వచ్చిన కేసులు ఇవి. ప్రైవేట్ హాస్పిటల్స్​లో ట్రీట్మెంట్ తీసుకొని టెస్టులు చేయగా, కేసులు పదుల సంఖ్యలో ఉంటాయి. 

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం గవర్నమెంట్ ల్యాబ్​లో నిర్ధారణ అయిన వాటి లెక్కలనే పరిగణలోకి తీసుకుంటుంది. దేవునిపల్లి, మాచారెడ్డి, అన్నారం,  కామారెడ్డి అర్బన్, లింగంపేట పీహెచ్​సీలు హై  రిస్కూ ఏరియాలుగా అధికారులు గుర్తించారు.  ఇటీవల మాచారెడ్డి పీహెచ్​సీ పరిధిలోని  భవానిపేటలో 7 డెంగ్యూ కేసులు నిర్ధారణ అయ్యాయి.   నర్సన్నపల్లి, దేవునిపల్లి,  గూడెం,  యాచారం, ఉత్తునూర్,  భవానిపేట,  బొల్లారం, హన్మాజీపేట,  అంకిరెడ్డిపల్లి తండా, ఎల్లంపేట, లక్ష్మీదేవునిపల్లి,  గర్గుల్,  సోమార్ పేట,  రాజన్న తండాల్లో డెంగ్యూ కేసులు వచ్చాయి.   కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో 2 నెలల్లో పలువురు డెంగ్యూ బారిన పడ్డారు. వీరు  ఎక్కువగా ప్రైవేట్​ హాస్పిటల్స్​లో ట్రీట్మెంట్​ తీసుకున్నారు. 

దేమికలాన్​లో డయేరియా..

తాడ్వాయి మండలం దేమికలాన్​లో డయేరియా ప్రబలుతోంది.  ఇక్కడ వాంతులు, విరేచనాలతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. 14 మంది జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్​, ప్రైవేట్ హాస్పిటల్స్​లో చికిత్స పొందుతున్నారు. విరేచనాలు, వాంతులతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.  బుధవారం గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేశారు.   

పరిసరాల అపరిశుభ్రత.. 

 జిల్లాలోని 3 మున్సిపాలిటీలతో పాటు,  పలు గ్రామాల్లో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి.  డ్రైనేజీల్లో  చెత్తతో పాటు, పలు ఏరియాల్లో  గడ్డి పెరిగి, అపరిశుభ్రంగా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో ఇండ్ల మధ్య  నీరు నిలిచి ఉంది. దోమలు వ్యాప్తి చెంది రోగాలకు కారణమవుతోంది. మున్సిపల్ అధికారులు పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  

జాగ్రత్తలు తీసుకుంటున్నాం..

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.  వానాకాలం దృష్ట్యా జ్వరాలపై ఇంటింట వివరాలు సేకరిస్తున్నాం.   వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని  ప్రజలకు సూచిస్తున్నాం.   డెంగ్యూ వచ్చిన ఏరియాల్లో పరిసరాలు క్లీన్​గా ఉంచుకోవాలని సూచనలు చేశాం. 

డాక్టర్ చంద్రశేఖర్, డీఎంహెచ్​వో