నవంబరు 1 నుంచి కారులో కూర్చునే వారందరికీ సీటు బెల్ట్ మస్ట్

నవంబరు 1 నుంచి కారులో కూర్చునే వారందరికీ సీటు బెల్ట్ మస్ట్

కారులో కూర్చున్న వారందరూ సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ముంబయి ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మోటార్ వాహన చట్టంలోని నిబంధనలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెప్టెంబర్ 4న మహారాష్ట్రలోని పాల్ఘర్ లో జరిగిన ఘోర ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, KPMG గ్లోబల్ స్ట్రాటజీ గ్రూప్ డైరెక్టర్ జహంగీర్ పండోల్‌లు ప్రాణాలు కోల్పోయారు. వెనుక సీటులో కూర్చొన్న వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో చనిపోయారు. ఈనేపథ్యంలో మరోసారి సీటు బెల్టు నిబంధనల అమలుపై ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించారు.

అందులో భాగంగా కారులో ముందు, వెనుక సీట్లలో కూర్చొన్న వారు నవంబర్ 1 నుంచి తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. ముంబయి ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రాజ్వర్ధన్ సిన్హా ఈ ఉత్తర్వులను జారీ చేశారు. మోటారు వాహనాల (సవరణ) చట్టం ప్రకారం సేఫ్టీ బెల్ట్ ధరించకుండా వాహనాన్ని నడపడంతో పాటు.. వెనుక కూర్చొన్న వారు సీటు బెల్టులు ధరించకపోతే శిక్షార్హుల కింద పరిగణిస్తామని వెల్లడించారు. కారులో సీటు బెల్ట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి 01/11/2022 వరకు గడువిచ్చారు. నవంబర్ 1 నుంచి రోడ్లపైకి వచ్చే ముందే సీటు బెల్టులు పెట్టుకోవాలని సూచించారు.