
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలో డీల్ కుదిరింది. కొన్ని వారాల పాటు జరిగిన చర్చల తర్వాత కూటమి పార్టీలు సీట్ల ఒప్పందానికి వచ్చాయి. డీల్ ప్రకారం బీజేపీ, జేడీయూ పార్టీలు చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తాన్ అవామ్ మోర్చా(హెచ్ఏఎం)లకు చెరో 6 సీట్ల చొప్పున కేటాయించారు.
అలాగే, లోక్ జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్) కి 29 సీట్లు కేటాయించారని కేంద్ర మంత్రి, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’ లో తెలిపారు. ఎన్నో సంప్రదింపులు, తర్జనభర్జనల తర్వాత ఎన్డీయే కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు.
కాగా.. తమకు40 నుంచి 45 సీట్లు ఇవ్వాలని లోక్ జన్ శక్తి పార్టీ పట్టుబట్టగా.. బీజేపీ 25 సీట్లు ఆఫర్ చేసింది. చర్చల తర్వాత చివరకు 29 సీట్లు ఇస్తామని బీజేపీ ఆఫర్ చేయగా అందుకు ఎల్జేపీ ఒప్పుకుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 115 స్థానాల్లో పోటీ చేయగా.. బీజేపీ 110 చోట్ల పోటీ చేసింది. ఈసారి రెండు పార్టీలు 101 చొప్పున సీట్లలో పోటీ చేయడానికి డీల్ కుదుర్చుకున్నాయి.
మహాఘట్బంధన్లో చర్చలు.. కాంగ్రెస్‌కు 50 నుంచి 70 సీట్లు కేటాయించే చాన్స్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమి పార్టీల మధ్య ఈ వారంలోనే సీట్ల పంపకాలు కుదిరే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో కూటమి పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఉమ్మడి మ్యానిఫెస్టోను కూడా విడుదల చేయనున్నాయి. సీట్ల పంపకాల కోసం ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య చర్చలు జరుగుతున్నాయని, ఆ పార్టీ అధినేతలు సోమవారం ఢిల్లీలో భేటీ అవుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ తెలిపారు.
ఆదివారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘సీట్ షేరింగ్‌పై బిహార్‌లో కూటమి పార్టీ నేతలందరితోనూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు బలంగా ఉన్నచోట అభ్యర్థులను ఖరారు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు సోమవారం ఢిల్లీలో కలిసి సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకోవచ్చు” అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న ప్రశ్నకు కనీసం 50 నుంచి 70 సీట్లు కాంగ్రెస్‌కు కేటాయించే అవకాశం ఉందన్నారు. అంగీకరించదగ్గ సీట్లనే కాంగ్రెస్‌కు కేటాయిస్తారని భావిస్తున్నామని చెప్పారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిహార్‌లో మార్పు కనిపిస్తుందని, సీఎం నితీశ్ కుమార్ పాలనతో బిహార్ ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు.
‘‘ఇరవై ఏండ్ల క్రితం ఏంజరిగిందనే విషయంపై బిహారీలు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. వర్తమానంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి ప్రజలు చింతిస్తున్నారు. 20 ఏండ్ల క్రితం నితీశ్ వేరు.. ఇప్పటి నితీశ్ వేరు. ఆయన మళ్లీ సీఎం అయ్యే అవకాశం లేదు” అని జైరాం వ్యాఖ్యానించారు.