వాటాలు తగ్గించుకోవాలంటూ ఎస్‌‌బీఐ, ఎల్‌‌ఐసీలకు సెబీ ఆదేశాలు

వాటాలు తగ్గించుకోవాలంటూ ఎస్‌‌బీఐ, ఎల్‌‌ఐసీలకు సెబీ ఆదేశాలు

మీ వాటాలను తగ్గించుకోవాలి

ముంబై: మ్యూచువల్‌‌ ఫండ్ సంస్థ​యూటీఐ ఏఎంసీ (అసెట్​మేనేజ్‌‌మెంట్ కంపెనీ)లో వాటాను 10 శాతం దిగువకు తగ్గించుకోవాలని ప్రభుత్వరంగ సంస్థలైన ఎస్‌‌బీఐ, ఎల్‌‌ఐసీ, బీఓబీ(బ్యాంక్​ ఆఫ్​బరోడా)లను  మార్కెట్​ రెగ్యులేటర్‌‌ (సెబీ) శనివారం ఆదేశించింది. క్రాస్​ హోల్డింగ్​ రూల్స్‌‌ ప్రకారం  వచ్చే ఏడాది డిసెంబర్​ 31 నాటికి ఈ సంస్థలు తమ వాటాను  తగ్గించుకోవాల్సి ఉంది. అంతేకాకుండా యూటీఐ ఏఎంసీ, యూటీఐ ట్రస్టీ బోర్డులోని తమ నామినీలను కూడా 2020 డిసెంబర్​31 నాటికి తొలగించాల్సి ఉంటుంది.  ఒక వేళ ఈ సంస్థలు తమ వాటాను 9.99 శాతం దిగువకు తగ్గించుకోకపోతే, షేర్‌‌‌‌హోల్డింగ్, ఓటింగ్​ హక్కులు నిలిచిపోతాయని సెబీ తన ఆదేశాలలో పేర్కొంది. ఈ రూల్స్ అమలు రిపోర్టును ఈ మూడు సంస్థలు వచ్చే నెలలోపు సమర్పించాలని పేర్కొంది. కాగా ఈ అంశంపై ఎల్‌‌ఐసీ, ఎస్‌‌బీఐ, బీఓబీ స్పందించలేదు.

క్రాస్​ హోల్డింగ్​ లిమిట్​ అంటే?

మ్యూచువల్‌‌‌‌ఫండ్స్‌‌లో  కాన్‌‌ఫ్లిక్ట్‌‌ ఆఫ్‌‌ ఇంట్రెస్ట్‌‌ (విరుద్ధ ప్రయోజనాలు) తొలగించేందుకు సెబీ2018 మార్చిలో క్రాస్​హోల్డింగ్​ లిమిట్స్‌‌ను తీసుకొచ్చింది. ఈ రూల్స్‌‌ ప్రకారం ఏదైనా షేర్‌‌‌‌హోల్డర్​ కంపెనీకి ఒక మ్యూచువల్‌‌​ఫండ్​కంటే ఎక్కువ మ్యూచువల్‌‌​ఫండ్​ కంపెనీలలో 10 శాతం కంటే ఎక్కువ వాటా ఉండొద్దు. అంతేకాకుండా ఆ కంపెనీలో షేరుహోల్డర్లు తమ బోర్డు పదవులకు రాజీనామా చేయాలి. ‘ఈ రూల్స్‌‌ మార్చి 20 నెలలు కావస్తున్నప్పటికీ ఈ సంస్థలు(ఎల్‌‌ఐసీ, ఎస్‌‌బీఐ, బీఓబీ) వీటిని అనుసరించడం లేదు’ అని సెబీ మెంబర్ మహాలింగం అన్నారు. ‘ఈ మూడు సంస్థలు యూటీఐ ఏఎంసీలోని తమ వాటాను తగ్గించుకుంటున్నాయి. అయినప్పటికి రెగ్యులేషన్​7బీ రూల్ ఇంకా పెండింగ్‌‌లోనే ఉంది’ అని తెలిపారు. ‘కాన్‌‌ఫ్లిక్ట్‌‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌‌ మొత్తం మ్యూచువల్‌‌‌‌ఫండ్​పరిశ్రమపైనే తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది’ అని సెబీ పేర్కొంది. ‘మ్యూచువల్‌‌‌‌ఫండ్​ పరిశ్రమను మెరుగుపరిచేందుకు ఈ కాన్‌‌ఫ్లిక్ట్‌‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌‌ను తొలగించడంలో రెగ్యులేషన్​ 7బీని అమలు పరచడం కష్టం’ అని వివరించింది. కాగా తమ వాటాలను తగ్గించుకోవడంపై  ఈ మూడు ప్రభుత్వ సంస్థలు తమ రోడ్​మ్యాప్‌‌ను  ప్రకటించలేదు.  యూటీఐ ఏఎంసీ 2009, నవంబర్​7 షేర్‌‌‌‌హోల్డింగ్​ అగ్రిమెంట్​ ప్రకారం 10 శాతం కంటే అధికంగా వాటాను కలిగిన షేర్‌‌హోల్డింగ్​ వ్యక్తులు లేదా  కంపెనీలు  కంపెనీలకు బోర్డులో డైరక్టర్లను నామినేట్​ చేసే అధికారం ఉంటుంది.  ప్రస్తుతం యూటీఐ మ్యూచువల్‌‌‌‌ఫండ్‌‌లో ఎల్‌‌ఐసీ, ఎస్‌‌బీఐ, బీఓబీ  సంస్థలకు 18.25 శాతం చొప్పున వాటా ఉంది.