యాషెస్ లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. ఇంగ్లాండ్ పై అలవోక విజయాలు సాధిస్తూ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆతిధ్య ఆస్ట్రేలియాకు ఇంగ్లాం కనీస పోటీ ఇవ్వలేకపోతుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా వార్ వన్ సైడ్ చేస్తోంది. ఇంగ్లాండ్ ఆటపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ లో చెత్త షాట్స్ ఆడుతూ వికెట్స్ పారేసుకుంటున్నారు. తొలి టెస్టులో బౌలింగ్ లో పర్వాలేదనిపించిన ఇంగ్లాండ్.. బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. రెండో టెస్టులో రెండు విభాగాల్లోనూ చేతులెత్తేసింది. రెండో టెస్టులో రూట్ సెంచరీ తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంగ్లాండ్ ఆటపై ఆ దేశ దిగ్గజ క్రికెటర్ ఇయాన్ బోథమ్ మండిపడ్డాడు. రెండో టెస్టులో ఓటమి తర్వాత తీవ్ర విమర్శలు చేశాడు.
రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఓటమిపై బోథమ్ మాట్లాడుతూ తన నిరాశను వ్యక్తపరిచాడు. తాను ఒక ప్రేక్షకుడిగా.. ఇంగ్లాండ్ అభిమానిగా మ్యాచ్ చూడడానికి వస్తే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును తిరిగి డబ్బు అడిగేవాడినని అభిప్రాయపడ్డారు. "నేను ఇంగ్లాండ్ కు సపోర్ట్ చేయడానికి ఇక్కడకి డబ్బులు పెట్టి వచ్చి ఉంటే, నేను ECBని తిరిగి డబ్బు అడుగుతాను. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టు యాషెస్ కు సిద్ధంగా రాలేదు. ఇంగ్లాండ్ కు పింక్ బాల్ ఆడిన అనుభవం లేదు. ఈ టెస్ట్ మ్యాచ్ కు ముందు వారు కాన్ బెర్రాలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఉండాల్సింది. ఈ ట్రిక్ ఇంగ్లాండ్ మిస్ అయింది". అని బోథమ్ చెప్పుకొచ్చాడు.
రెండో టెస్టులో ఆస్ట్రేలియా అలవోక విజయం:
యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తో ఆదివారం (నవంబర్ 7) ముగిసిన రెండో టెస్ట్ (డేనైట్)లోనూ ఆసీస్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 2–0 ఆధిక్యంలో నిలిచారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 65 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు నాలుగో రోజు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లలో 69/2 స్కోరు చేసి నెగ్గింది. ట్రావిస్ హెడ్ (22), స్మిత్ (23 నాటౌట్), జాక్ వెదరాల్డ్ (17 నాటౌట్) మెరుగ్గా ఆడారు. లబుషేన్ (3) ఫెయిలయ్యాడు.
►ALSO READ | IND vs SA: సౌతాఫ్రికాతో తొలి టీ20: అర్షదీప్, హర్షిత్ ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
అట్కిన్సన్ రెండు వికెట్లు తీశాడు. అంతకుముందు 134/6 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 75.2 ఓవర్లలో 241 రన్స్‌కు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (50), విల్ జాక్స్ (41) మెరుగ్గా ఆడినా అట్కిన్సన్ (3), బైడన్ కార్స్ (7), ఆర్చర్ (5 నాటౌట్) నిరాశపర్చారు. మైకేల్ నీసర్ (5/42) ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. బుధవారం నుంచి అడిలైడ్‌లో మూడో టెస్ట్ జరుగుతుంది.
