ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం (డిసెండర్ 08) గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన మీడియాతో ముచ్చటించారు. ప్రపంచమంతా గ్లోబల్ సమ్మిట్ వైపు ఆసక్తిగా చూస్తున్నదని ఈ సందర్భంగా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ నినాదంతో మంత్రులందరం యూనిటీగా పని చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ,2047 వరకు 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.
ఆర్ అండ్ బీ శాఖ ఆద్వర్యంలో జాతీయ రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్పోర్టులు, డ్రైపోర్ట్ నుండి కోస్టల్ ఏరియా కనెక్టివిటీ, సౌత్ ఇండియా స్టేట్స్ కనెక్టివిటీ కారిడార్, గ్రీన్ ఫీల్డ్ హైవేలు లాంటి ప్రణాళికతో వెళ్తున్నామని తెలిపారు మంత్రి వెంకట్ రెడ్డి. తమ విజన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో పూర్తిగా 4లేన్ల రోడ్లు రాబోతున్నాయని అన్నారు. మంచి రోడ్లు ఉంటే..గ్రామీణ తెలంగాణ అభివృద్ది చెందుతుందని.. పరిశ్రమలు వస్తాయని..యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి, బెంగళూరు, చెన్నై గ్రీన్ ఫీల్డ్ రహదారులు, బుల్లెట్ ట్రైన్ కారిడార్లు రాబోతున్నాయని తెలిపారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష విమర్శలపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తెలంగాణలో ప్రతిపక్షమే లేదన్నారు. తమ కుటుంబంలో ఒక్కొక్కరు పదివేల కోట్లు తిన్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపిస్తోందని తెలిపారు. కేసీఆర్ క్యాబినెట్ మంత్రులపై కవిత చేసిన ఆరోపణలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
