టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, వీడియోలు, వాయిస్‌ను వాణిజ్య ప్రకటనల కోసం, ఇతర అవసరాల కోసం ఉపయోగించకుండా అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్టీఆర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది
కోర్టు ఆదేశాలు.. చర్యలు తప్పనిసరి!
జస్టిస్ అరోరా నేతృత్వంలోని న్యాయస్థానం, ఎన్టీఆర్ చేసిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు, టెలికాం ఆపరేటర్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఆయా ప్లాట్‌ఫామ్స్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ఈ అంశంపై సవివరమైన ఆదేశాలు జారీ చేయనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.
చిరు, నాగ్ బాటలో ఎన్టీఆర్..
ఇటీవల కాలంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువయ్యాయి. నటుల అనుమతి లేకుండా వారి పేర్లు, ఫోటోలు, వీడియోలను ఉపయోగించి ట్రోలింగ్, డీప్ ఫేక్ వీడియోల తయారీ, వాణిజ్య ప్రకటనలు రూపొందించడం వంటివి చేస్తున్నారు. ఈ సమస్యను అరికట్టడానికి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కూడా ఇదే తరహాలో హైకోర్టును ఆశ్రయించారు. తమ హక్కులను పరిరక్షించుకోవాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే బాటలో పయనించడం ద్వారా, తన వ్యక్తిగత బ్రాండ్‌కు, ఇమేజ్‌కు రక్షణ కల్పించుకునే ప్రయత్నం చేశారు. ఇకపై ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటో, వాయిస్ ఉపయోగించేవారు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
'డ్రాగన్' ఫైట్!
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ , డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్ర యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా చిత్రీకరణను వేగవంతం చేశారు.
►ALSO READ | Nagarjuna: 'ఫ్యూచర్ సిటీ'లో మరో ప్రపంచ స్థాయి స్టూడియో సాధ్యం.. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌పై నాగార్జున ప్రశంసలు!
