Nagarjuna: 'ఫ్యూచర్ సిటీ'లో మరో ప్రపంచ స్థాయి స్టూడియో సాధ్యం.. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌పై నాగార్జున ప్రశంసలు!

Nagarjuna: 'ఫ్యూచర్ సిటీ'లో మరో ప్రపంచ స్థాయి స్టూడియో సాధ్యం.. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌పై నాగార్జున ప్రశంసలు!

తెలంగాణను 2047 నాటికి గ్లోబల్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది.  ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 అత్యంత వైభవంగా  సోమవారం (డిసెంబర్ 8, 2025)   ప్రారంభమైంది. ఫ్యూచర్ సిటీ వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ మెగా ఆర్థిక సదస్సును రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ చారిత్రక సదస్సుకు దేశీయంగా, అంతర్జాతీయంగా విశేష స్పందన లభించింది. దాదాపు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యం. 

సీఎం విజన్ పై నాగార్జున ప్రశంసలు.. 

సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సందర్శించారు. స్టాల్స్ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన 'ఫ్యూచర్ సిటీ' ఆలోచనను ప్రశంసించారు. "దాదాపు 50 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాం. ఇక్కడి వాతావరణం, ప్రభుత్వ విధానాలు బాగున్నాయి. అన్నపూర్ణ స్టూడియో ఇక్కడే ఉంది. ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ ప్రముఖులతో కలిసి మరో అత్యాధునిక స్టూడియో నిర్మాణానికి ముందుకు రావడం శుభపరిణామం. అందరూ కలిసి వస్తే ప్రపంచ స్థాయి ఫెసిలిటీస్‌తో పెద్ద నిర్మాణం చేయవచ్చు" అని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.

►ALSO READ | Bigg Boss 9: బిగ్ బాస్ విన్నర్ రేంజ్‍లో రీతూ చౌదరి రెమ్యూనరేషన్.. 13 వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందంటే?

 భవితకు బాట..

పెట్టుబడులు, పాలసీలు, సుస్థిర అభివృద్ధి అంశాలపై ఈ సదస్సులో మొత్తం 27 సెషన్లలో నిపుణుల బృందాలు విస్తృతంగా చర్చలు జరపనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే వివిధ రంగాల అంతర్జాతీయ ప్రతినిధుల బృందాలతో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, నూతన పారిశ్రామిక విధానాలను ఆయన వారికి వివరిస్తున్నారు. సదస్సు ప్రాంగణంలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ల సమక్షంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం కేవలం భారతీయ ఆర్థిక వ్యవస్థకే కాక, ప్రపంచ పటంలో శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా ఎదగడానికి అవసరమైన వేదికగా నిలుస్తోంది.