న్యూఢిల్లీ: స్టాక్‌బ్రోకింగ్ కంపెనీ ప్రభుదాస్ లీలాధర్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఎల్) వచ్చే నెల 15 నుంచి 7 రోజులు పాటు కొత్త అసైన్‌మెంట్‌లు, కాంట్రాక్టులు చేపట్టకుండా మార్కెట్ రెగ్యులేటరీ సెబీ నిషేధించింది. కంపెనీ 2021 ఏప్రిల్–2022 అక్టోబర్ మధ్య క్లయింట్ ఫండ్‌ల దుర్వినియోగం, మార్జిన్ రిపోర్టింగ్ లోపాలు, అకౌంట్ సెటిల్‌మెంట్ ఆలస్యం వంటివి చేసిందని తాజా పరిశీలనలో తేలింది. 2021 జులైలోని మూడు తేదీల్లో “జీవాల్యూ” నెగటివ్‌గా మారి రూ.2.70 కోట్లు లోటు చూపింది.
క్లయింట్ల ఫండ్స్ తగ్గితే ఈ ఇండికేటర్ ద్వారా తెలుస్తుంది. సెబీ ప్రకారం, 1,283 నాన్-ట్రేడెడ్ క్లయింట్లు, 677 మంత్లీ కేసులు, 3 ట్రేడెడ్ అకౌంట్లు సమయానికి సెటిల్ చేయలేదు. 9 సందర్భాల్లో మార్జిన్ రిపోర్టింగ్ తప్పుగా చూపింది. ఒక క్లయింట్‌కు రూ.55.46 లక్షల పీక్ మార్జిన్ లోటు నమోదైంది. ఎన్‌ఎస్‌ఈ నియమాలకు విరుద్ధంగా మార్జిన్ పెనాల్టీలు క్లయింట్లపై వేశారు. వీటితో పాటు కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్‌ఏ) అప్‌లోడ్లు, తప్పు లెడ్జర్ రిపోర్టింగ్ వంటి లోపాలను సెబీ గుర్తించింది.
