మనం సాధారణంగా పుట్టినరోజులకో, పండుగలకో బట్టలు లేదా వస్తువుల కోసం గిఫ్ట్ కార్డ్స్ ఇస్తుంటాం. కానీ త్వరలో షాపింగ్ కార్డ్స్ తరహాలోనే మ్యూచువల్ ఫండ్ గిఫ్ట్ కార్డ్స్ రూపంలో ఇచ్చే రోజులు రాబోతున్నాయి. దీనికోసం స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఒక వినూత్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. డబ్బును ఖర్చు చేసే అలవాటు కంటే.. పొదుపు చేసే అలవాటును ప్రోత్సహించడమే ఈ ఆలోచన వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
ఏమిటీ మ్యూచువల్ ఫండ్ గిఫ్ట్ కార్డ్?
సాధారణ ప్రీపెయిడ్ కార్డులాగే ఇది పని చేస్తుంది. ఎవరైనా ఆన్‌లైన్‌లో లేదా ఫిజికల్ గా ఈ కార్డును కొనుగోలు చేసి తమ బంధువులకు, స్నేహితులకు బహుమతిగా ఇవ్వొచ్చు. దీని గరిష్ట విలువ రూ.10వేలు గా నిర్ణయించారు. బహుమతి అందుకున్న వ్యక్తి ఆ కార్డుతో తనకు నచ్చిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ ఆ వ్యక్తికి అవగాహన లేకపోతే, బహుమతి ఇచ్చే వారు ఒక స్కీమ్‌ను సూచించవచ్చు. అయితే ఫైనల్ డెసిషన్ మాత్రం గిఫ్ట్ తీసుకున్న వ్యక్తిదే.
ఈ విధానం దుర్వినియోగం కాకుండా సెబీ కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. కార్డులోని పూర్తి మొత్తాన్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలి. సగం వాడి సగం మిగిల్చడానికి వీల్లేదు. వాలెట్ ఆధారిత పెట్టుబడుల వార్షిక పరిమితి రూ.50వేల లోపే ఈ గిఫ్ట్ కార్డ్స్ ఉండాలి. క్యాష్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే ఈ కార్డులు కొనాలి. క్రెడిట్ కార్డులు లేదా క్యాష్‌బ్యాక్ రివార్డులను అనుమతించరు. ఒకవేళ ఏడాది పాటు కార్డును వాడకపోతే, ఆ డబ్బు తిరిగి కొన్న వ్యక్తి బ్యాంక్ ఖాతాకే చేరుతుంది.
ప్రయోజనం ఎవరికి?
ముఖ్యంగా మొదటిసారి పెట్టుబడి పెట్టే యువతకు, విద్యార్థులకు ఇది ఒక గొప్ప ఆరంభం అవుతుంది. డబ్బులు ఇస్తే ఖర్చయిపోతుందనే భయం ఉంటుంది. కానీ ఇలా పెట్టుబడిని బహుమతిగా ఇవ్వడం వల్ల వారిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. పెట్టుబడి ద్వారా వచ్చే లాభాలు నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాకే జమవుతాయి.
