సెబీ శుభవార్త.. మ్యూచువల్ ఫండ్స్ గిఫ్టింగ్ ఇక సులువు.. బెనిఫిట్స్ ఇవే..

సెబీ శుభవార్త.. మ్యూచువల్ ఫండ్స్ గిఫ్టింగ్ ఇక సులువు.. బెనిఫిట్స్ ఇవే..

మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే లక్షలాది మంది భారతీయ ఇన్వెస్టర్లకు శుభవార్త. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ ఇటీవల చేసిన ఒక ముఖ్యమైన మార్పు వల్ల.. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ఒకరి నుంచి మరొకరికి గిఫ్ట్ గా ఇవ్వడం లేదా ట్రాన్స్ ఫర్ చేయటం గతంలో కంటే ఎంతో సులభతరం అయ్యింది. దీని ద్వారా కోట్లాది రూపాయల పెట్టుబడులున్న ఇన్వెస్టర్లు పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో ఆదా చేసుకునేందుకు కొత్త మార్గం తెరుచుకుంది.

మారిన రూల్స్ ప్రకారం ఇన్వెస్టర్లు ఇకపై డీమ్యాట్ రూపంలో ఉన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్లతో పాటు స్టేట్‌మెంట్ ఆఫ్ అకౌంట్ రూపంలో ఉన్న యూనిట్లను కూడా నేరుగా బదిలీ చేయవచ్చని సెబీ వెల్లడించింది. అయితే గతంలో డీమ్యాట్ హోల్డింగ్స్‌లో లేని మ్యూచువల్ ఫండ్ యూనిట్లను బహుమతిగా ఇవ్వాలంటే.. వాటిని తప్పనిసరిగా రీడీమ్ చేసి, ఆ డబ్బును బహుమతిగా ఇచ్చి, తిరిగి ఆ డబ్బుతో కొత్త యూనిట్లను కొనాల్సి వచ్చేది. ఈ రీడీమ్ ప్రక్రియ వల్ల యూనిట్లపై అప్పటిదాకా వచ్చిన లాభాలపై అనవసరంగా పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఇది గిఫ్టింగ్, వారసత్వం, జాయింట్ హోల్డింగ్స్‌లో పెద్ద అడ్డంకిగా ఉండేది.

సెబీ తీసుకొచ్చిన కొత్త సంస్కరణలతో ఎక్కువ పన్ను శ్లాబులో ఉన్న ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను, తక్కువ ఆదాయం లేదా ఆదాయం లేని కుటుంబ సభ్యులకు అంటే తల్లిదండ్రులు, పిల్లలకు సులువుగా బదిలీ చేసి పన్ను ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి రూ.10 లక్షల లాభం ఉన్న యూనిట్లను ఆదాయం లేని తన పిల్లలకు గిఫ్ట్ ఇస్తే.. ఆ లాభం మొత్తం సెక్షన్ 87ఏ కింద దాదాపుగా టాక్స్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తి ఈ యూనిట్లను విక్రయించినప్పుడు, వారి మొత్తం ఆదాయం పన్ను పరిమితిలోపే ఉంటే.. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు.

ఇప్పుడు వచ్చిన మార్పులతో మ్యూచువల్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ చేయటం అనేది కేవలం ఒక లింక్ మరియు రెండు OTPల ద్వారా పూర్తవుతుందని ఫైనాన్షియల్ అడ్వైజర్ ముముక్షు దేశాయ్ వెల్లడించారు.