కెనడాలో కపిల్ శర్మ కేఫ్‌పై మరోసారి కాల్పులు.. ముంబైలో తదుపరి చర్య అంటూ గ్యాంగ్‌స్టర్ హెచ్చరిక

కెనడాలో కపిల్ శర్మ కేఫ్‌పై మరోసారి కాల్పులు.. ముంబైలో తదుపరి చర్య అంటూ గ్యాంగ్‌స్టర్ హెచ్చరిక

బాలీవుడ్ ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మకు చెందిన కెనడాలోని 'క్యాప్స్ కేఫ్' (Kap's Cafe) పై మరోసారి కాల్పులు జరిగాయి.  సర్రేలో ఉన్న ఈ కేఫ్‌పై కేవలం ఒక నెల వ్యవధిలోనే ఇది రెండోసారి జరిగిన దాడి. ఈ ఘటనతో స్థానికులతో పాటు భారతీయులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ ధిల్లాన్ ప్రకటించడం సంచలనంగా మారింది.

 లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పనే..
ఈ కాల్పుల ఘటన తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ ఒక ఆన్‌లైన్ పోస్ట్ ద్వారా ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపాడు. ఆ పోస్ట్‌లో "జై శ్రీరామ్, సత్ శ్రీ అకాల్, రామ్ రామ్ టు ఆల్ బ్రదర్స్" అని పేర్కొంటూ, సర్రేలోని కపిల్ శర్మ 'క్యాప్స్ కేఫ్'లో జరిగిన కాల్పుల బాధ్యతను తాను, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తీసుకుంటున్నామని తెలిపాడు. మేము అతనికి కాల్ చేశాం.. కానీ అతను ఫోన్ లీప్ట్ చేయలేదు. అందుకే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఇప్పటికీ అతను మా మాట వినకపోతే త్వరలో ముంబైలో తదుపరి చర్య తీసుకుంటాం అని ఆ పోస్ట్‌లో తీవ్రంగా హెచ్చరించారు.

 

రెండోసారి దాడి.. పోలీసులు దర్యాప్తు
గత నెలలో ఇదే కేఫ్‌పై మొదటిసారి కాల్పులు జరిగినప్పుడు, నిషేధిత ఖలిస్తానీ సంస్థ బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) కు చెందిన హర్జిత్ సింగ్ లడ్డీ బాధ్యత వహించాడు. కపిల్ శర్మ తన షోలో నిహాంగ్ సిక్కుల గురించి చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని లడ్డీ పేర్కొన్నాడు. ఇప్పుడు రెండోసారి జరిగిన దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించడంతో, ఈ రెండు గ్యాంగ్‌ల మధ్య ఏమైనా సంబంధం ఉందా, లేదా ఇది విడివిడి ఘటనలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కెనడాలో భారతీయ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని గ్యాంగ్‌స్టర్ల దాడులు, బెదిరింపులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో పంజాబీ గాయకులు ఏ.పి. ధిల్లాన్, గిప్పీ గ్రెవాల్ ఇళ్లపైనా ఇలాంటి దాడులు జరిగాయి. ఈ ఘటనలతో స్థానిక ప్రభుత్వం, పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కెనడాలోని భారతీయుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ దాడులను అరికట్టడానికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.