ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలు తప్పలేదు. ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, దేశీయంగా ప్రైవేట్ బ్యాంకింగ్, మెటల్, పవర్ రంగాల షేర్లలో ప్రాఫిట్‌బుకింగ్ కారణంగా ఇండెక్స్‌లు నిరాశపర్చాయి. బీఎస్ఈ సెన్సెక్స్ శుక్రవారం 465.75 పాయింట్లు తగ్గి 83,938.71 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో ఇది 498.8 పాయింట్ల వరకు పడిపోయింది.
30 షేర్లలో 25 నష్టపోగా, ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 155.75 పాయింట్లు (0.60 శాతం) పడిపోయి 25,722.10 వద్ద ముగిసింది. ఇది 25,750 స్థాయి కంటే దిగువకు చేరింది. ఈ నష్టానికి ప్రధానంగా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ చేసిన ప్రకటనలు కారణమయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. యూఎస్-–చైనా వాణిజ్య పరిణామాలపై స్పష్టత లేకపోవడం కూడా ఆందోళన కలిగించింది.
యూఎస్, యూరప్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. దీంతో పాటు ఎఫ్ఐఐలు గురువారం ఒక్కరోజే రూ. 3,077.59 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. అయితే డీఐఐలు రూ. 2,469.34 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. కార్పొరేట్ కంపెనీల ఫలితాలు మిశ్రమంగా ఉండడం కూడా ఇన్వెస్టర్లలో గందరగోళానికి దారితీసింది. ఇటీవల భారీగా లాభపడిన ప్రైవేట్ బ్యాంకింగ్, మెటల్, పవర్ వంటి రంగాల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది.
సెక్టోరల్ ఇండెక్స్‌లు ఇలా..
బీఎస్ఈ సెక్టోరల్ఇండెక్స్లలో యుటిలిటీస్ 1.28 శాతం, మెటల్ 1.15 శాతం, పవర్ 1.03 శాతం, సర్వీసెస్ 0.91 శాతం, కమోడిటీస్ 0.90 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.69 శాతం నష్టపోయాయి. లాభపడిన రంగాలలో ఎనర్జీ, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఉన్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ గేజ్ 0.55 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.40 శాతం పడిపోయింది.
బీఎస్ఈలో మొత్తం 2,370 స్టాక్‌లు పడిపోగా, 1,784 మాత్రమే లాభపడ్డాయి. సెన్సెక్స్‌లో నష్టపోయిన ప్రధాన షేర్లలో ఎటర్నల్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, పవర్ గ్రిడ్, ట్రెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, లార్సెన్ అండ్ టర్బో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఐటీసీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభపడ్డాయి.
ఈవారంలో సెన్సెక్స్ 273.17 పాయింట్లు (0.32 శాతం), నిఫ్టీ 73.05 పాయింట్లు (0.28 శాతం) నష్టపోయాయి. బ్రెంట్ క్రూడ్ ధర కూడా 0.31 శాతం తగ్గి 64.80 డాలర్లకు పడిపోయింది.
