
ఆదిలాబాద్ : మరికాసేపట్లో పెళ్లి అవుతుందనగా వధువు నా భార్య అని, ఈ పెళ్లి జరగడానికి వీళ్లేదని సినిమాలో హీరోలాగే ఎంట్రీ ఇచ్చాడు ఓ యువకుడు. పోలీసులతో ఎంట్రీ ఇచ్చిన అతను.. పెళ్లి కూతురికి తనకు ఇది వరకే మ్యారేజ్ అయ్యిందని.. ఆమె తల్లిదండ్రులు బలవంతంగా వేరే వ్యక్తితో ఈ పెళ్లి చేస్తున్నారని చెప్పాడు. సంవత్సరం కిందటే పెళ్లి కూతురిని తాను ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నానని.. మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లి ఫొటోలు చూపించాడు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వరుడి బంధువులు కార్లను ధ్వంసం చేశారు. తమను మోసం చేశారంటూ అక్కడి నుంచి వెళ్లి పోయారు. భయంతో పెళ్లి కూతురిని మండపానికి తీసుకురాకుండానే అమ్మాయి తల్లిదండ్రులు పరారీ కావడంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఈ సంఘటన ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో జరుగగా స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ..‘‘ఆదిలాబాద్ కృష్ణానగర్ కు చెందిన ఎస్‌ఐ చంద్రభాన్ కుమార్తె మాధవిని ఏడాది కిందట హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నా. అయితే మాధవిని ఆమె తండ్రి బలవంతంగా ఆదిలాబాద్ కు తీసుకొచ్చి ఏడాది పాటు ఇంట్లోనే ఉంచారు. ఆమెకు మరో పెళ్లి చేస్తున్నారని ఇటీవల మాధవి నాకు ఈ-మెయిల్ పంపింది. దీంతో మా ఇద్దరికీ వివాహమైందనే ఆధారాలతో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ కోర్టును ఆశ్రయించి సెర్చ్ వారెంటు పొందా. ఆ వారెంటుతో మండపానికి రాగా.. మాపై దాడి చేయడంతోపాటు మాతో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ను కొట్టారు’’ అని సంజీవ్ వాపోయారు. దాడి గురించి న్యాయస్థానంలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.