యాదాద్రి, నల్గొండ, వెలుగు : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. శుక్రవారం ప్రచారం ముగియడంతో వాతావరణం ఒక్కసారిగా సైలెన్స్‌గా మారిపోయింది. ఎన్నికలు జరిగే మండలాల్లో వైన్స్ షాపులను కూడా మూసి వేశారు. ఈనెల 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనుంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో బ్యాలెట్ పేపర్లు, బాక్సులు రెడీగా ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ కోసం ఆర్వో, పీవో, ఓపీవో ఎంపిక పూర్తయింది. పోలింగ్ సెంటర్లలో వెబ్‌కాస్టింగ్ కూడా చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
సెకండ్ ఫేజ్ఎన్నికలు..
- యాదాద్రి జిల్లాలో మొత్తం 140 జీపీలు, 1161 వార్డులు, -సూర్యాపేటలో జిల్లాలో 158 గ్రామాలు, 1287 వార్డులు, -నల్గొండ జిల్లాలో 241 గ్రామాలు, 1831, వార్డులకు ఈనెల 14న రెండో విడత ఎన్నికలు జరుగనున్నాయి. యాదాద్రి జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలోని మండలాలైన భువనగిరి, బీబీనగర్, భూదాన్ పోచంపల్లి సహా వలిగొండ, రామన్నపేట మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. సూర్యాపేట జిల్లాలో పెనపహాడ్, చివ్వేంల, మోతే, మునగాల, నడిగూడెం, కోదాడ, అనంతగిరి, చిలుకూరు మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని అడవిదేవులపల్లి, అనుముల, దామరచర్ల, మాడుగులపల్లి, మిర్యాలగూడ, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, త్రిపురారం, వేములపల్లి మండలాల్లోని రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు..
ఎన్నికలు జరగాల్సిన పంచాయతీలకు, వార్డు స్థానాలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు, బాక్సులు డిస్ట్రిబ్యూషన్సెంటర్లకు చేరాయి. వీటిని ఈనెల 13న పంచాయతీలకు తరలిస్తారు. బ్యాలెట్ బాక్సులు సహా పోలింగ్ రోజున అవసరమయ్యే 53 రకాల సామగ్రిని డిస్టిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్సెంటర్లకు తరలిస్తారు.
అధికారుల కేటాయింపు..
యాదాద్రి జిల్లాలో సెకెండ్ ఫేజ్ ఎన్నికల నిర్వహణ కోసం 2,800 మంది అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఇందులో138 మంది రిటర్నింగ్ఆఫీసర్లు, 38 మంది జోనల్ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తారు. నల్గొండ జిల్లాలో 2,898 మంది ప్రిసైడింగ్ అధికారులు, 3,334 మంది ఇతర ప్రిసైడింగ్ అధికారులు అవసరం కాగా, ఇందుకు సంబంధించి ఆయా మండలాలవారీగా 2,418 బృందాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ సిబ్బంది కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులు 1901, ఓపీవోలు 2,429 పోలింగ్ కోసం ర్యాండమైజేషన్ జరిపారు.
వెరీ కాస్ట్లీ పంచాయతీలు..
సెకండ్ ఫేజ్‌లో ఎన్నికలు జరుగుతున్న కొన్ని పంచాయతీల్లో భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థుల్లో కొందరు పార్టీతో సంబంధం లేకుండా అందరికీ ఓకే రీతిలో ఇస్తున్నారు. మరికొందరు లిమిటెడ్ ఓటర్లను ఎంచుకొని వారికే ఎక్కువ మొత్తం అందిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో అభ్యర్థి రూ.2 వేల నుంచి రూ. 5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు.
పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. బీఎల్వోలు ఇప్పటికే ఓటర్లకు పోలింగ్స్లిప్పులు అందించారు. ఈనెల 14న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఒంటి గంటలోపు సెంటర్‌కు వచ్చిన వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తాం. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తాం.- భాస్కరరావు, అడిషనల్ కలెక్టర్, యాదాద్రి

