సెకండ్ ​ఫేజ్ ​మెట్రో శంకుస్థాపన స్థల పరిశీలన

సెకండ్ ​ఫేజ్ ​మెట్రో శంకుస్థాపన స్థల పరిశీలన

మాదాపూర్/గండిపేట, వెలుగు:  మైండ్​స్పేస్ ​జంక్షన్ రాయదుర్గం స్టేషన్ నుంచి నానక్​రాంగూడ ఔటర్ ​రింగు రోడ్​ మీదుగా శంషాబాద్​ఎయిర్​పోర్టు వరకు నిర్మించనున్న సెకండ్ ​ఫేజ్ మెట్రో పనులకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ ​శంకుస్థాపన చేయనున్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద శంకుస్థాపన చేసే స్థలాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్​యాదవ్, మహమూద్​అలీ, సబితారెడ్డి, ఎంపీ రంజిత్​రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, మెట్రోఎండీ ఎన్వీఎస్​రెడ్డి గురువారం పరిశీలించారు. 

శిలాఫలకం, పైలాన్​ ఏర్పాటు, ట్రాఫిక్​ మళ్లింపు అంశాలపై సైబరాబాద్​ సీపీ స్టీఫెన్​రవీంద్ర, జీహెచ్ఎంసీ అధికారులతో చర్చించారు. అనంతరం బండ్లగూడ జాగీర్​ కార్పొరేషన్ పరిధిలోని రాష్ట్ర పోలీస్ అకాడమీ గ్రౌండ్​ను సైతం మంత్రులు, అధికారులు పరిశీలించారు. మెట్రో ఫేజ్– 2 పనుల శంకుస్థాపన తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్ర పోలీస్‌ అకాడామీ గ్రౌండ్​లో బహిరంగ సభలో పాల్గొని  ప్రసంగిస్తారని వారు చెప్పారు.

యాదవ సంఘానికి స్థలం కేటాయించండి

మెహిదీపట్నం: యాదవ సంఘానికి కార్వాన్ నియోజకవర్గంలో ఎకరం స్థలం కేటాయించాలని ఆ సంఘం నాయకులు మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ ను కోరారు. కార్వాన్ యాదవ సంఘం అధ్యక్షుడు బోడి అశోక్ కుమార్, టీఆర్ఎస్ లీడర్లు గడ్డం శ్రీనివాస్, గోదా లక్ష్మీకాంత్, గోదా మధుసూదన్ గురువారం మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. మూసీ నది పరివాహక ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో ఎకరం కేటాయిస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.