నల్గొండ జిల్లాలో రెండో విడత ఎన్నికలు ప్రశాంతం

నల్గొండ జిల్లాలో రెండో విడత ఎన్నికలు ప్రశాంతం
  • సూర్యాపేట జిల్లాలో పుంజుకున్న వామపక్షాలు 
  • అంతిమంగా కాంగ్రెస్ కు పట్టం కట్టిన పల్లె ఓటర్లు 
  • ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత పంచాయతీ ఎన్నికలు 
  • నల్గొండలో  88. 74, సూర్యాపేటలో 89.55 శాతం పోలింగ్

నల్గొండ, వెలుగు:  రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ ముందంజలో నిలిచింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని 399 పంచాయతీ స్థానాలకు, 3292 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. నల్గొండ 88. 74, సూర్యాపేటలో 89.59 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్​తొలి రెండు గంటల్లో 20 నుంచి 25 శాతం నమోదుకాగా, ఆ తర్వాత రెండు గంటల వ్యవధిలోనే ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్​ కేంద్రాల కు చేరుకున్నారు. 

చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఓటర్లు పోలింగ్​కేంద్రాలకు ఆలస్యంగా వచ్చారు. ఇతర ప్రాంతాల నుంచి సైతం ఓటర్లు భారీగానే తరలివచ్చారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్​ ముగిసే సమయానికి ఓటర్లు పోలింగ్​ కేంద్రాల వద్ద భా రీగా క్యూలో నిలుచున్నారు.  దీంతో పోలింగ్​ ఆలస్యంగా ముగిసింది.  

మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొదట పోస్టల్​బ్యాలెట్లను లెక్కించారు.  తదనంతరం వార్డులకు పోలైన ఓట్లను లెక్కించారు. వార్డుల లెక్కింపు తర్వాత సర్పంచ్​ అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కించారు. 

కాంగ్రెస్ పై చేయి​​...

రెండవ విడత ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ ముందంజలో నిలిచి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. మొదటి విడతలో అనుకున్నన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం  సాధించకపోవడంతో రెండవ విడత ఎన్నికలపై ఫోకస్ పెట్టిన నాయకులు ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేలా వ్యూహంతో ముందుకు వెళ్లారు.

 కాంగ్రెస్ రెబల్స్​ వల్ల ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉండడంతో వారిని బుజ్జగించడంతో  ఓట్లు చీలకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో రెండవ విడతలో రెండు జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు భారీగా సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలను కైవసం చేసుకున్నారు. మరో పక్క మొదటి విడతలో పుంజుకున్న బీఆర్ఎస్ రెండవ విడతలో వెనుకబడిపోయింది. 

కాంగ్రెస్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఇక సూర్యాపేట జిల్లాలోని కోదాడ డివిజన్ పరిధిలో కమ్యూనిస్ట్ పార్టీలు సత్తా చాటారు. కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న మునగాల మండలంలో మెజార్టీ స్థానాల్లో గెలుపొందడం విశేషం. దీంతో తమ ప్రాబల్యం తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నారు. ఇక పల్లె పోరులో బీజేపీ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 

రికార్డు స్థాయిలో పోలింగ్​...

నల్గొండ జిల్లాలో మొత్తం ఓటర్లు 2,99, 576 మంది కాగా, 2,65,852 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్​పర్సంటేజీ 88.74 శాతం నమోదైంది. పురుషులు 1,46,709 మంది కిగాను 1,30,041  మంది ఓటు వేశారు. పోలింగ్​89.25శాతం నమోదైంది. మహిళలు 1,52,840  మందికిగాను 1,34,900 మంది ఓటు వేశారు. పోలింగ్​ 88.26 శాతం నమోదైంది. 

ఇతరులు 27 మందికి గాను 11 మంది ఓటు వేశారు. పోలింగ్ 40.74 శాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలో మొత్తం ఓట్లు 2,35,137 మందికిగాను 2,10,576  మంది ఓటు వేశారు. పోలిం గ్​ 89.28శాతం నమోదైంది. పురుషులు 1,14,803 మందికిగాను 1,03,143మంది (89.84శాతం) ఓటు వేశారు. మహిళలు 1,20, 326 మందికిగాను 1,07,428 మంది (89.28శాతం) ఓటు వేశారు. ఇతరులు 8 మందికిగాను 5గురు (62.50 శాతం) ఓటు వేశారు. 

పోలింగ్​ సరళి ఇలా...

జిల్లాపేరు    7గంటలకు    11గంటలకు    1గంటకు (శాతం)    ఫైనల్ పోలింగ్  
నల్లగొండ        28.15                 56.44                   82.74                                 88.74 
సూర్యాపేట     25.18                  60.07                   86.78                                89.55