- మెదక్ జిల్లాలో 88.80 శాతం పోలింగ్
- సిద్దిపేట జిల్లాలో88.36 శాతం పోలింగ్
- సంగారెడ్డిజిల్లాలో 87.06 శాతం పోలింగ్
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. 8 మండలాల పరిధిలో మొత్తం 1,72,656 ఓట్లు ఉండగా అందులో 1,53,313 ఓట్లు ( 88.80 శాతం) పోలయ్యాయి. అత్యధికంగా మెదక్ మండలంలో 91.64 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆదివారం ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటేశారు.
నడిచే స్థితిలో లేని వృద్ధులు, దివ్యాంగులకు పోలీసులు సహకరించారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను సర్పంచ్ అభ్యర్థులు కార్లు, ఆటోల్లో తీసుకువచ్చి ఓటేయించారు. ఎమ్మెల్యే రోహిత్ దంపతులు సొంతూరైన చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్వగ్రామం రామాయంపేట మండలం కోనాపూర్‌లో ఓటేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, ఏఎస్పీ మహెందర్ ఆయా మండలాల్లో పర్యటించి పోలింగ్ తీరును పరిశీలించారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో పది మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరిగాయి. సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావు పేట, దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్ పేట భూంపలి, తొగుట, బెజ్జంకి మండలాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓట్లు వేశారు. పది మండలాల పరిధిలో 182 పంచాయతీలు 1644 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డ్స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
పది మండలాల పరిధిలో మొత్తం 2,44,776 ఓట్లలో 2,16,294 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా 88.36 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలైన ఓట్ల లో పురుషులు 1,06,360, మహిళలు1,09,934 మంది ఓటు హక్కును వినియోగించకోగా పురుషుల కంటే మహిళలు 3,574 మంది అధికంగా ఓట్లు వేశారు.
మిరుదొడ్డి మండలంలో అత్యధికంగా 90.16 శాతం, అత్యల్పంగా బెజ్జంకి మండలంలో 85.39 శాతం పోలింగ్‌నమోదైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ప్రారంభమైన రెండు గంటల్లో 23.25 శాతం మేర పోలింగ్జరుగగా 11 గంటల వరకు 58.43 శాతం , ఒంటి గంట వరకు 84.37 పోలింగ్ శాతం నమోదైంది. కలెక్టర్హైమావతి, సీపీ విజయ్‌కుమార్ పోలింగ్తీరును గమనించారు.
సంగారెడ్డిలో..
జిల్లాలో అందోల్, జహీరాబాద్ డివిజన్ల పరిధిలో మొత్తం 10 మండలాల్లో 243 పంచాయతీలు, 2,164 వార్డు స్థానాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించగా ఇందులో 14 పంచాయతీలు, 222 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అందోల్ మండలంలో 87.98 శాతం, చౌటకూర్ లో 87.47 శాతం, ఝరాసంగంలో 88.59 శాతం, కోహిర్ లో 84.82 శాతం, మొగుడంపల్లిలో 85.50 శాతం, మునిపల్లిలో 89.19 శాతం, పుల్కల్ లో 87.31 శాతం, రాయికోడ్ లో 88.40 శాతం, వట్ పల్లిలో 87.91 శాతం, జహీరాబాద్ మండలంలో 84.23 శాతం పోలింగ్ నమోదైంది.
పది మండలాలు కలిపి మొత్తం 87.06 శాతం పోలింగ్ నమోదైంది. కలెక్టర్ ప్రావీణ్య పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. కోహిర్ మండలం దిగ్వాల్ పంచాయతీ పోలింగ్ సెంటర్ లో 110 ఏళ్ల వృద్ధురాలు రాజ్యమ్మ కుటుంబ సభ్యుల సాయంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చౌటకూరులో మరో 110 ఏళ్ల వృద్ధురాలు తన మనవళ్ల సాయంతో ఓటు వేశారు. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తండా కౌంటింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి సబితా బాయి సొమ్మసిల్లి పడిపోవడంతో 108 వాహనంలో జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
పుల్కల్ లో ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తున్న ఓ పోలీస్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారని స్థానికులు నిలదీయడంతో డీఎస్పీ సత్తయ్య గౌడ్ సదరు పోలీసుకు మరో పోలింగ్ స్టేషన్ వద్ద డ్యూటీ వేశారు.
