- ముగిసిన ప్రచారం,14న పోలింగ్, అదే రోజు ఫలితాలు
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నెల 14న జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అధికారులు పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించారు. ఆయా మండలాల పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో రెండో విడతలో 8 మండలాల్లో 149 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 7 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అవిపోను 142 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా చోట్ల సర్పంచ్ స్థానాలకు 544 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 1,290 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా రెండు చోట్ల ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. 254 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అవి పోను 1,034 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 2,952 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో పురుషులు 84,695, మహిళలు 91,470, ఇతరులు 2 కలిపి మొత్తం 1,76,168 మంది ఓటర్లు ఉన్నారు. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకుగాను 1,290 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు 143 మంది రిటర్నింగ్ఆఫీసర్లు, 1,246 మంది పోలింగ్ఆఫీసర్లు, 1,457 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్లను నియమించారు.
సంగారెడ్డి జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో రెండో విడతలో అందోల్, జహీరాబాద్ డివిజన్ల పరిధిలో 10 మండలాల్లో మొత్తం 243 పంచాయతీలు, 2,164 వార్డు స్థానాలకు అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేయగా ఇందులో 14 పంచాయతీలు, 222 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అవిపోను మిగతా 229 సర్పంచ్ స్థానాలు, 1,941 వార్డు స్థానాలకు ఈ నెల 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. అందోల్, చౌటకూర్, పుల్కల్, వట్ పల్లి, రాయికోడ్, ఝరాసంగం, జహీరాబాద్, మొగుడంపల్లి, కోహిర్, మునిపల్లి మండలాల్లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలో రెండో విడతలో సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిన్నకోడూర్, అక్బర్ పేట -భూంపల్లి, దుబ్బాక, మిర్దొడ్డి, నంగునూర్, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట, హుస్నాబాద్, బెజ్జంకి మండలాల పరిధిలోని 182 పంచాయతీలు, 1,644 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 10 సర్పంచ్ స్థానాలు, 278 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అవిపోను సర్పంచ్ స్థానాలకు 694 మంది అభ్యర్థులు, వార్డు మెంబర్ స్థానాలకు 3,917 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎన్నికల నిర్వహణకు 1,64 4 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేయగా, 1,973 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 2,436 మంది అదర్ ప్రిసైడింగ్ఆఫీసర్లను నియమించారు. జిల్లాలో పురుషులు 1,21,927, మహిళలు 1,27.954 కలిపి మొత్తం 2,49,882 మంది ఓటర్లు ఉన్నారు.

