లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇందిరమ్మ ఫండ్స్​ .. 47 మందికి లక్ష చొప్పున జమ

లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇందిరమ్మ ఫండ్స్​ .. 47 మందికి లక్ష చొప్పున జమ
  • కొనసాగుతున్న రెండో విడత వెరిఫికేషన్

మెదక్, వెలుగు:  ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిన వారికి మొదటి విడత డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. మొదటి విడతలో మండలానికి ఒకటి చొప్పున 21 పైలట్ గ్రామాల్లో 1,339 ఇండ్లు మంజూరయ్యాయి. వాటిలో 350 ఇండ్ల నిర్మాణం గ్రౌండింగ్ అయింది. అందులో 80 ఇండ్లు బేస్​మెంట్​లెవల్ వరకు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 47 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున జమయ్యాయి. 

లబ్ధిదారుల గుర్తింపునకు సర్వే

రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500  ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కానున్నాయి. మొదటి విడతలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాలు మినహా మిగతా గ్రామాలు, పట్టణాలలో ఇండ్లను మంజూరు చేయనున్నారు. ఈ మేరకు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హుల గుర్తింపు కోసం గ్రామాలు, పట్టణాల్లో వెరిఫికేషన్ నడుస్తోంది. ఇందిరమ్మ కమిటీల ప్రతిపాదనల మేరకు గెజిటెడ్ ఆఫీసర్ హోదా గల అధికారులు గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం సొంత ఇల్లు లేని నిరుపేదలను గుర్తిస్తున్నారు. 

16 మోడల్ ఇండ్ల నిర్మాణం

జిల్లాలో 16 చోట్ల మోడల్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణాల్లో వీటిని నిర్మిస్తున్నారు. వాటిలో 4 చోట్ల స్లాబ్ పూర్తికాగా 5 చోట్ల రూఫ్ లెవెల్ లో ఉన్నాయి. మరో 3 చోట్ల బేస్​మెంట్​స్థాయిలో ఉన్నాయి. రూ.5 లక్షల వ్యయంతో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మోడల్ ఇండ్ల నిర్మాణం చేస్తున్నారు. 

90 శాతం వెరిఫికేషన్ పూర్తి

జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ దాదాపు 90 శాతం పూర్తయింది. త్వరలోనే మొత్తం పూర్తవుతుంది. సర్వే అయిపోగానే  గుర్తించిన అర్హుల జాబితాను కలెక్టర్ ద్వారా ఇన్​చార్జి మంత్రికి పంపితే వారు జాబితా పరిశీలించి ఇండ్ల మంజూరుకు అమోదం తెలుపుతారు. ఈ నెలలోనే ఇండ్లు మంజూరయ్యే అవకాశం ఉంది.మాణిక్యం, హౌసింగ్ పీడీ