- కలెక్టర్ హైమావతి
సిద్దిపేట టౌన్, వెలుగు: సీఎం కప్తో గ్రామీణ క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులను క్రమశిక్షణ గల పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత పీఈటీలపై ఉందన్నారు.
విద్యార్థులందరూ తప్పనిసరిగా ఏదో ఒక క్రీడలో పాల్గొనాలని సూచించారు. సిద్దిపేట జిల్లా క్రీడల్లో ముందుందని మరింత ప్రాక్టీస్ చేసి సిద్దిపేట బ్రాండ్ ను కొనసాగించాలని క్రీడాకారులకు సూచించారు. జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి వెంకట నరసయ్య మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలో ప్రతిభ కనబరిచే క్రీడాకారులను రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు. జడ్పీ సీఈవో రమేశ్, హమీద్, ప్రిన్సిపాల్ రవి నాయక్ పాల్గొన్నారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి
ప్రభుత్వ స్కూళ్లలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ఎంఈవోలతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ మండలంలో ఒక ప్రణాళిక రూపొందించాలని డీఈవో శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులను బాగా చదివించాలని వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ప్రత్యేక తరగతులు, స్టడీ హవర్ లో విద్యార్థులకు సబ్జెక్ట్ పై అవగాహన కల్పించాలన్నారు.
చదువులో వెనకబడిన విద్యార్థులపై ఎక్కువ శ్రద్ధ తీసుకుని చదివించాలన్నారు. మీ సేవా సెంటర్ లో కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలకు అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఈడీఎం ఆనంద్ కి ఫోన్ ద్వారా ఆదేశించారు.
