
- దేవాదాయ శాఖకు హైకోర్టు ఆర్డర్స్
హైదరాబాద్, వెలుగు : సికింద్రాబాద్ మహం కాళి ఆలయంలో కరోనా కారణంగా వ్యాపారులు కోల్పోయిన లైసెన్సు కాలాన్ని 5 నెలలపాటు పొడిగించాలని హైకోర్టు ఆదేశించింది. 292 రోజుల లైసెన్సు కాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు పట్టించుకోకుండా చీరలు, జాకెట్ ముక్కలు, కొబ్బరి చిప్పల సేకరణ నిమిత్తం మహంకాళి ఆలయ ఈవో ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్‌ను నవీన్‌కుమార్ సవాల్ చేశారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎన్ వి శ్రవణ్‌కుమార్ సోమవారం విచారించారు. పిటిషనర్లకు 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు హక్కులు ఉన్నాయని, కరోనా వల్ల షాపుల్ని బంద్ చేయడంతో 292 రోజులు పొడిగిస్తూ 2021 డిసెంబరు 17న ప్రభుత్వం మెమో ఇచ్చిందని పిటిషనర్ లాయర్ చెప్పారు. దీనిని అమలు చేయలేదన్నారు. అందుకు విరుద్ధంగా ఈవో టెండరు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఈ వాదనను దేవాదాయ శాఖ తరఫు అడ్వకేట్వ్యతిరేకించారు. పిటిషనర్లకు ఇచ్చిన గడువు కంటే అదనంగా కొనసాగించినట్టు తెలిపారు.
2023 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 దాకా లైసెన్సు పొడిగించామని చెప్పారు. మళ్లీ పొడిగించాలని కోరడం చెల్లదన్నారు. 2020 జూన్ నుంచి అక్టోబరు 30 దాకా ఆలయం తెరిచే ఉందన్నారు. టికెట్ల విక్రయానికి సంబంధించిన మెమోను పరిశీలించాలని కోరారు. వాదనల తర్వాత పిటిషనర్ల షాపుల లైసెన్సు కాలాన్ని 5 నెలలు పొడిగించాలని ఈవోను ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది.