చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏంటి..? పిల్లల భవిష్యత్తు కోసం వీటిని ఎలా ఎంచుకోవాలి..?

చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏంటి..? పిల్లల భవిష్యత్తు కోసం వీటిని ఎలా ఎంచుకోవాలి..?

ప్రతి తల్లిదండ్రుల కల.. తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలి అన్నదే. అయితే పెరుగుతున్న ఖర్చులు, ఊహించని పరిస్థితుల మధ్య ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా మారుతోంది. ఇక్కడే చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్  ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం భద్రతకు మాత్రమే కాదు, పిల్లల జీవితంలో కీలక మైలురాళ్ల కోసం పక్కా ప్రణాళికతో డబ్బును కూడబెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది.

చైల్డ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?
చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది రెండు ముఖ్య ఉద్దేశ్యాలను నెరవేర్చే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది ఒకవైపు పిల్లల భవిష్యత్తు అవసరాలైన ఉన్నత విద్య, పెళ్లి కోసం పొదుపు సాధనంగా పనిచేస్తుంది. అలాగే మరోవైపు తల్లిదండ్రులకు లైఫ్ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుంది. ఒకవేళ పాలసీదారు (తల్లిదండ్రులు) దురదృష్టవశాత్తు మరణించినా.. ఈ ప్లాన్ ద్వారా పిల్లల ఆర్థిక భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అండగా నిలుస్తుంది. IRDAI ఈ ఉత్పత్తులను పర్యవేక్షిస్తుంది. అయితే వీటి ఎంపిక విషయంలో గమనించాల్సిన 4 అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. భవిష్యత్తు అవసరాన్ని అంచనా వేయండి: 
ముందుగా మీ పిల్లల ఉన్నత విద్య వంటి ఖర్చులకు ఎప్పుడు, ఎంత డబ్బు అవసరమవుతుందో లెక్కించండి. ఉదాహరణకు ప్రస్తుతం రూ.10 లక్షలు అయ్యే ఇంజనీరింగ్ కోర్సుకు 15 ఏళ్ల తర్వాత ద్రవ్యోల్బణం కారణంగా ఎంత ఖర్చవుతుందో అంచనా వేయండి. దీని కోసం ఆన్‌లైన్ చైల్డ్ ప్లాన్ కాలిక్యులేటర్‌లను ఉపయోగించడం మంచిది.

2. ప్లాన్ ఫీచర్‌లను అర్థం చేసుకోండి: 
ప్లాన్‌లో ఉండాల్సిన ముఖ్యమైన ఫీచర్ 'వేవర్ ఆఫ్ ప్రీమియం బెనిఫిట్'. ఇది తల్లిదండ్రులు మరణించినా, ప్రీమియం చెల్లింపు నిలిచిపోయినా, పాలసీ కొనసాగేలా చూస్తుంది. అలాగే మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి డబ్బు కావాలా, లేక దశలవారీగా చెల్లింపులు కావాలా అని నిర్ణయించుకోండి. ULIP వంటి కొన్ని ప్లాన్‌లు అత్యవసర పరిస్థితుల కోసం పాక్షికంగా డబ్బును తీసుకునేందుకు కూడా అవకాశాన్ని ఇస్తాయి.

3. రిస్క్ సామర్థ్యాన్ని పరిగణించండి: 
 స్థిరమైన గ్యారెంటీడ్ రిటర్న్స్ కోరుకునే తక్కువ రిస్క్ తీసుకునేవారైతే సాంప్రదాయ ఎండోమెంట్ లేదా మనీ-బ్యాక్ ప్లాన్‌లు బెస్ట్. ఎక్కువ రిటర్న్స్ కోసం మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకోగలిగే వ్యక్తి అయితేULIP ప్లాన్స్ బెస్ట్ ఆప్షన్.

4. ప్రీమియం చెల్లింపు ఆప్షన్స్: 
మీ ఆదాయానికి అనుగుణంగా ప్రీమియం చెల్లింపు పద్ధతిని (నెలవారీ, త్రైమాసిక, వార్షిక లేదా సింగిల్ ప్రీమియం) ఎంచుకోండి. ఆర్థిక ఒత్తిడి లేకుండా పాలసీని కొనసాగించడానికి ఇది చాలా ముఖ్యం.