ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు

ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు రానున్నారు. ఆయన పర్యటన సందర్భంగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  బీజేపీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్ లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. జులై 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొని, ఆ తర్వాత రాజ్ భవన్ లో బస చేస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.

హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్ భవన్ మార్గాల్లో 4వేల మంది పోలీసులు పహారాలో ఉంటారన్న సీవీ ఆనంద్ చెప్పారు. జడ్, జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న నాయకులు వస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీ సహా.. ‌‌కేంద్రమంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సభకు హాజరవుతారని, పరేడ్ గ్రౌండ్స్ లో లక్ష మంది వరకు కూర్చునే అవకాశం ఉందని తెలిపారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇతర జిల్లాల నుంచి అధికారులను పిలిపించామన్న కమిషనర్...  పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3వేల మందితో పహారా కాస్తున్నామని చెప్పారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బందోబస్త్ లో ఉంటారని, డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను సెక్టార్ ఇంఛార్జ్ లుగా నియమించామని స్పష్టం చేశారు.