కలెక్టరేట్ల వద్ద సెక్యూరిటీ ఫుల్ టైట్

కలెక్టరేట్ల వద్ద సెక్యూరిటీ ఫుల్ టైట్
  • మెయిన్‍ గేట్ల వద్ద చెక్‍ పోస్టుల ఏర్పాటు
  • పని మీద వచ్చే సామాన్యులకు సవాలక్ష ప్రశ్నలు
  • కలెక్టర్​ సీసీ ఓకే అంటేనే లోపలికి పర్మిషన్‍

వరంగల్‍/వనపర్తి, వెలుగు: సీఎం కేసీఆర్​ నివాసం ప్రగతిభవన్​ లెక్కనే  కలెక్టరేట్ల వద్ద సెక్యూరిటీని సర్కారు టైట్​ చేసింది. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్​ సీఎంగా ఉన్నంతకాలం క్యాంప్​ ఆఫీసులో ప్రతిరోజూ ప్రజల నుంచి అర్జీలు తీసుకొని పరిష్కరించేవారు. కానీ, కేసీఆర్​ సీఎం అయ్యాక ఈ సంప్రదాయానికి తెరపడగా, ప్రజలు తమ కష్టాలు చెప్పుకునేందుకు జిల్లాల్లోని కలెక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్​సెల్​తో పాటు అడపాదడపా ప్రతిరోజూ కలెక్టరేట్​కు వెళ్తుంటారు. కానీ ఇప్పుడు కొత్తగా కట్టిన కలెక్టర్‍ ఆఫీసులతోపాటు కొన్నిచోట్ల పాత కలెక్టరేట్లలోకి కూడా సామాన్యులు వెళ్లే పరిస్థితి లేదు.

తమ బాధలు, తమకు జరిగిన అన్యాయాలు, కింది స్థాయి ఆఫీసర్ల అవినీతి, అక్రమాలపై  కలెక్టర్లకు చెప్పకోడానికి వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే బాధితులను మెయిన్​ గేట్​ దగ్గర్నే  ఆపేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఎంట్రెన్స్​ల వద్ద చెక్​పోస్టులను ఏర్పాటు చేసి సెక్యూరిటీని టైట్​చేస్తున్నారు. ఐదారుగురు ప్రైవేట్‍ సెక్యూరిటీ వాళ్లతో పాటు ముగ్గురు, నలుగురు పోలీసులను కాపలా పెడుతున్నారు.

కలెక్టరేట్​కు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణితో పాటు మిగిలినరోజుల్లోనూ వచ్చే సామాన్యులను తమ ప్రశ్నలతో వాళ్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇక్కడి నుంచి లోపల విధుల్లో ఉండే కలెక్టర్‍ క్యాంప్​ క్లర్క్​(సీసీ), ఇతర ఆఫీసర్లకు ఫోన్​ చేసి, వాళ్లు ఓకే అంటేనే గేట్​ పాస్​లాంటి ఓ చీటీ రాసి చేతిలో పెట్టి, లోపలికి పర్మిషన్‍ ఇస్తున్నారు. కలెక్టర్‍ వద్ద రెండు నిమిషాలు తమ గోడు వెళ్లబోసుకోడానికి వెళ్తే మెయిన్‍ గేటు నుంచి ఆఫీసర్‍ను కలిసే వరకు ఈజీగా రెండు, మూడు గంటలు పడుతోందని జనం అంటున్నారు. 
సవాలక్ష ప్రశ్నలతో బాధితుల పరేషాన్‍
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో కొత్త కలెక్టర్‍ ఆఫీసులు కడుతున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల,  హనుమకొండ, వనపర్తి లాంటి కొన్ని చోట్ల కొత్త కలెక్టరేట్లు ఓపెన్​ అయ్యాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. గతంలో మాదిరి జనాలకు కలెక్టర్లను ఈజీగా కలిసే అవకాశం ఉండడం లేదు. ఆఫీసర్లను కలిసేందుకు వచ్చే బాధితులను.. పోలీసులు, ప్రైవేట్‍ టెక్యూరిటీ మెయిన్‍ గేట్‍ వద్దే ఎవరు నువ్వు..? ఏం చేస్తవ్‍..? ఏ ఊరు.. ఎందుకొచ్చావ్‍..? ఎవర్ని కలవాలే..? ఏ పార్టీలో తిరుగుతవ్‍..? ఐడీ, ఆధార్‍ కార్డ్ చూపించు.. చేతిలోని కవర్‍, బ్యాగ్‍ ఓపెన్‍ చెయ్‍.. జేబుల్లో ఏముంది..? వంటి సవాలక్ష ప్రశ్నలతో చిన్నపాటి ఇన్వెస్టిగేషన్‍ చేస్తున్నారు.

మండలస్థాయి ఆఫీసర్లను కలవాలని వెనక్కి పంపిస్తున్నారు. డ్యూటీలో భాగంగా చేతిలో లాఠీలు, తుపాకులతో ఉండే ఖాకీలు కాస్త గద్దించినట్లు అడగడంతో చదువురాని వాళ్లు, ముసలివాళ్లు పరేషాన్‍ అవుతున్నారు. కలెక్టర్ సీసీలతో మాట్లాడి పర్మిషన్​ ఇస్తే పాస్​ మాదిరి ఓ చీటి రాసి ఇచ్చి లోపలికి పంపుతున్నారు. అక్కడ సీసీలు మరోసారి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 
‘చలో కలెక్టరేట్‍’ అంటే.. పర్మిషన్‍ బంద్‍ 
కొత్త  కలెక్టర్‍ ఆఫీసుల ముందు ధర్నాలు, నిరసనలు తెలిపేందుకు పోలీసులు పర్మిషన్‍ ఇవ్వడంలేదు. గతంలో ప్రజా సమస్యలపై రాజకీయ పార్టీలు, స్టూడెంట్‍ ఆర్గనైజేషన్లు, కుల సంఘాలు, మహిళా సంఘాలు ‘చలో కలెక్టరేట్‍’కు పిలుపునిచ్చేవి. ర్యాలీగా వచ్చి కలెక్టర్‍ ఆఫీసుల ముందు కాసేపు నిరసన తెలిపేవాళ్లు. చివరికి ఓ నలుగురు లోపలకు వెళ్లి పెద్దాఫీసర్లకు సమస్యల కాపీని అందించి వాటిని పరిష్కరించాలని కోరే అవకాశం ఉండేది. ఇప్పుడు కలెక్టర్‍ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు అంటే పోలీసులు అనుమతి ఇవ్వడంలేదు.

జిల్లా కేంద్రాల్లో ఏదో మూలన ఉండే ఓ ప్లేసులో టెంట్‍ వేసుకుని శాంతియుత నిరసన మాత్రమే తెలపాల్సి వస్తున్నది. దీనికి కూడా ముందస్తు పర్మిషన్‍ తీసుకోవాల్సి వస్తున్నది. హనుమకొండ, వరంగల్​జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా ‘ఏకశిల పార్క్ సెంటర్’  వద్ద మాత్రమే ధర్నాలు చేసుకోవాలని కండీషన్  పెట్టారు. సిద్దిపేట, వనపర్తి లాంటి కొత్త కలెక్టరేట్లతో పాటు నల్గొండ, గద్వాల లాంటి పాత కలెక్టరేట్ల వద్ద కూడా  ఐదారుగురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్​తో పాటు ఇద్దరు ముగ్గురు పోలీసులకు డ్యూటీ వేస్తున్నారు. 

 

ఇవి కూడా చదవండి

మైక్రో ఇన్సూరెన్స్ గరీబులకు వరం

ట్రాఫిక్ రూల్స్.. 5 పాయింట్లకు మించితే వాహనం సీజ్‌

వచ్చే ఏడాది నుంచి పల్లె విద్యార్థులకు ఇంటి వద్దకే వర్సిటీలు

మన రక్తంలో మైక్రో ప్లాస్టిక్‌‌!