మైక్రో ఇన్సూరెన్స్ గరీబులకు వరం

మైక్రో ఇన్సూరెన్స్ గరీబులకు వరం
  •     పాలసీ పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచాలె​
  •     అన్ని చోట్లా   పాలసీలను అందుబాటులో ఉంచాలె
  •      సూచించిన ఐఆర్​డీఏ ప్యానెల్​

తక్కువ ఆదాయంతో బతికే వాళ్లకు ఆపద వస్తే నష్టపోకుండా ఆదుకోవడానికి మైక్రో ఇన్సూరెన్స్ సదుపాయం విస్తరించాలని ఇన్సూరెన్స్​ రెగ్యులేటరీ డెవెలప్​మెంట్ అథారిటీ (ఐడీఆర్​ఏ) నియమించిన కమిటీ సూచించింది. ఇప్పుడున్న బీమా పరిమితిని రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షలవరకు పెంచాలని సిఫార్సు చేసింది. ప్రీమియం రేట్లను తగ్గించాలని కోరింది.

న్యూఢిల్లీ: పేద, మధ్యతరగతి వాళ్లందరికీ మేలు చేసేలా మైక్రో ఇన్సూరెన్స్ పాలసీల్లో మార్పులు తేవాలని, ప్రీమియాలు తగ్గించాలని, ఈజీగా అందుబాటులో ఉండేలా చూడాలని ఇన్సూరెన్స్ మార్కెట్​ రెగ్యులేటర్​ ఐఆర్​డీఏ నియమించిన కమిటీ సూచించింది. చౌక ధరల్లో పాలసీలను అందుబాటులోకి రావాలని,  ఇన్సూరెన్స్ పరిమితిని రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలకు పెంచాలని సూచించింది. ఇది అందజేసిన రిపోర్టులోని వివరాలు ఇలా ఉన్నాయి.  సాధారణ బీమా పాలసీలు  ఏడాదికి ఒకసారి రెన్యువల్​ అవుతాయి. వీటి కాలపరిమితిని మరింత పెంచాలి. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలను ప్రత్యేకంగా తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తుల రక్షణ కోసం రూపొందించాలి. దీనివల్ల అల్పాదాయ కుటుంబాలు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవటానికి, ఆపదల నుంచి  కోలుకోవడానికి వీలవుతుంది. బీమా రంగాన్ని సరళీకరించడం,  ప్రభుత్వ పథకాల వల్ల అసంఘటిత రంగ కార్మికులతోపాటు అత్యధిక మంది పేదలకు మైక్రో ఇన్సూరెన్స్​ అందుబాటులోకి వచ్చింది. పెద్ద సమస్య ఏమిటంటే, పేదలు రోజువారీ అవసరాలను కూడా తీర్చుకోవడానికే డబ్బు సరిపోదు. భవిష్యత్​ ఏదైనా సమస్యను ఎదుర్కోవడం కోసం ఇప్పుడే చెల్లించడానికి (బీమా కోసం) సంకోచిస్తున్నారు. అలాగే, ఆదాయంపై ఎలాంటి గ్యారంటీ లేకపోవడం వల్ల కవర్ కంటిన్యూటీ కోసం బీమా కిస్తీలను రెగ్యులర్​గా కట్టడం లేదు. 

ఇప్పుడున్న స్కీములతో లాభం తక్కువే!

ప్రస్తుత బీమా పథకాలపై పేదలకు పెద్దగా నమ్మకం లేదు. వీటితో లాభం ఉంటుందని వాళ్లు అనుకోవడం లేదు.  మైక్రో ఇన్సూరెన్స్‌‌‌‌పై, ముఖ్యంగా లైఫ్ పాలసీలపై స్టాంప్ డ్యూటీని మినహాయించాలి. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన రూ. 289 ప్రీమియంపై స్టాంప్ డ్యూటీ రూ. 40 లేదా 14 శాతం ఉంది. దీనిపై పూర్తి మినహాయింపు ఇవ్వాలి. అంతేగాక సాధారణ  ఆరోగ్య బీమా సంస్థలకు మైక్రో ఇన్సూరెన్స్​ ప్రొడక్టుల కోసం క్యాపిటల్​ రిజర్వు అవసరాలలో సడలింపు ఇవ్వాలి. దీనివల్ల మరిన్ని కంపెనీలు మైక్రో ఇన్సూరెన్స్​ పాలసీలు ఇస్తాయి. ధరల విషయంలో ఇన్సూరెన్స్​ కంపెనీలకు స్వేచ్ఛను ఇవ్వాలి. బీమా ప్రొడక్టులను ప్రారంభించిన తేదీ నుండి ఒక సంవత్సరంలోపు వాటి ధరలను న్యాయమైన విధానంలో సవరించడానికి అనుమతించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. రోజువారీగా, 15 రోజులకు ఒకసారి, నెలవారీగా లేదా మూడు నెలలకు ఒకసారి  ప్రీమియంలు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలి. పేదల రోజువారీ వేతనంలో కొంత మొత్తాన్ని బీమా ప్రీమియంగా అనుమతించే ప్రపోజల్​ను కూడా పరిశీలించాలి. వాళ్లు ఎంత ఎక్కువ మొత్తం ప్రీమియం చెల్లిస్తే అంత ఎక్కువ పొదుపు ప్రయోజనం ఉంటుంది.   మాస్టర్ పాలసీదారులైన మైక్రో ఫైనాన్స్ సంస్థలు తాము చేసిన క్రెడిట్ లైఫ్ వ్యాపారంపై కమీషన్లు పొందాలంటే కార్పొరేట్ ఏజెంట్లుగా మారాలి. మైక్రో ఇన్సూరెన్స్ ప్రొడక్టులు చాలా సింపుల్​ ఉండాలి. పాలసీహోల్డర్​కు వివరాలను సులువుగా అర్థం కావాలి. డిస్ట్రిబ్యూటర్లు అన్ని వివరాలనూ కస్టమర్​కు తెలియజేయాలి. బీమా ప్రొడక్టులను రూపొందించే సమయంలోనే కస్టమర్లతో సంప్రదింపులు జరపాలి. అన్ని చోట్లా మైక్రో ఫైనాన్స్​ ప్రొడక్టులు అందుబాటులో ఉండేలా చేయాలి. కిరాణా  దుకాణాలు లేదా బిజినెస్​ కరస్పాండెంట్ల ద్వారా ఇలాంటి పాలసీలను అమ్మాలని ఐఆర్​డీఏ ప్యానెల్​ సూచించింది.