ప్రస్తుతం వచ్చిన ఏఐ ప్రభంజనం ప్రపంచాన్ని తలకిందులు చేస్తోంది. ముఖ్యంగా ఐటీ సేవల రంగంలో ఇది పెద్ద మార్పులకు దారితీసింది. ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి భారతీయ టెక్ కంపెనీల వరకూ రోజూ ఉద్యోగులను ఇళ్లకు పంపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా మారిందంటే కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో అనే అయోమయంలో కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన చెందుతున్నారు.
అయితే గతంలో బెంగళూరులోని ఒరాకిల్ కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగి ప్రదీప్ కన్నన్ మాత్రం ఉద్యోగం కంటే సొంతంగా బిజినెస్ బెటర్ అని అంటున్నారు. ఆ నమ్మకంతోనే 2019లో జాబ్ మానేసి తమిళనాడులోని హోమ్ టౌన్ కరూర్ వెళ్లిపోయినట్లు ఎక్స్ పోస్టులో చెప్పుకొచ్చాడు. గడచిన ఆరేళ్ల కాలంలో సొంతంగా ఫలూదా బిజినెస్ స్టార్ట్ చేసి 18 ఔట్ లెట్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఒరాకిల్ సంస్థలో జాబ్ మానేసినప్పుడు ఏం చేయాలో సరైన ప్లాన్ లేకుండా ఊరెళ్లిపోయినప్పుడు అందరూ నవ్వారని చెప్పారు ప్రదీప్. మంచి సెటిల్డ్ జాబ్, ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎందుకిలా చేస్తున్నావని అందరూ ప్రశ్నించినట్లు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తన నిర్ణయాన్ని చాలా మంది నిర్లక్ష్యంగా భావించారని ప్రవీణ్ అన్నారు. అయితే తన శ్రమ ఫలించిందని చెప్పారు.
ఏసీ ఆఫీసులో పనిచేసిన రోజుల నుంచి ప్రస్తుతం ఫాంచైజీలను అందిస్తూ వ్యాపారం చేస్తున్న రోజుల వరకు ఆరేళ్లలో వచ్చిన మార్పును, తద్వారా ఆనందాన్ని గుర్తుచేసుకున్నారు. అందరూ తాను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాననుకున్నారని కానీ ప్రస్తుతం ఇండియా, దుబాయ్ వ్యాప్తంగా 18 కంటే ఎక్కువ స్టోర్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు ప్రదీప్. సోషల్ మీడియాలో టెకీ పోస్టు చూసిన చాలా మంది మెచ్చుకుంటూ సూపర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేటి తరం కూడా సక్సెస్ చూడాలంటే తమ కంఫర్ట్ జోన్ దాటి బయటకు రావాలని అందుకు ముందుగా ధైర్యం కూడా అవసరమని అన్నాడు.
ఇదే క్రమంలో అమెరికాలో ఐటీ ఉద్యోగిగా ఉన్న మణీందర్ సింగ్ తన కెరీర్ వదులుకుని పంజాబ్ మెుహాలీలో ఫుడ్ స్టార్ పెట్టాడు. తండ్రి మరణంతో ఇండియా తిరిగి వచ్చిన సింగ్ తిరిగి కార్పొరేట్ ఉద్యోగం వద్దనుకున్నాడు. తన భార్యకు ఉన్న వంట నైపుణ్యాలతో వ్యాపారం స్టార్ట్ చేసి పంజాబీ వంటకాలైన రాజ్మా, సోయా చాప్ వంటి ఆహారాలను అందిస్తూ ముందుకెళుతున్నాడు.
