ట్రిపుల్ ఆర్.. పరిహారం ప్రాసెస్ స్పీడప్.. భూమి రాశి పోర్టల్లో నిర్వాసితుల డిటైల్స్ అప్ లోడ్

 ట్రిపుల్ ఆర్.. పరిహారం ప్రాసెస్ స్పీడప్.. భూమి రాశి పోర్టల్లో నిర్వాసితుల డిటైల్స్ అప్ లోడ్
  • ముందుగా అగ్రికల్చర్ ల్యాండ్ డిటైల్స్ ఆ తర్వాత ప్లాట్స్ డిటైల్స్ 
  • అనంతరం పేమెంట్ ప్రక్రియ 
  • ల్యాండ్ వాల్యూ ఎకరానికి  అతి తక్కువగా రూ 3.37 లక్షలు 
  • హయ్యస్ట్ రేట్ రూ 20 లక్షలు
  • రెండు 'కాలా'ల పరిధిలో  రూ. 532 కోట్లు పరిహారం

యాదాద్రి, వెలుగు:  రీజినల్​రింగ్​రోడ్డు (ట్రిపుల్​ఆర్​) ఉత్తర భాగం కోసం భూములు కోల్పోనున్న రైతులకు పరిహారం అందించే ప్రాసెస్​ స్పీడప్​ అయింది. భువనగిరిలో సర్వే జరగకపోవడంతో తుర్కపల్లి, చౌటుప్పల్​ ‘కాలా’  ‘కంపింటెంట్ అథారిటీ ల్యాండ్ అక్విజేషన్  పరిధిలో భూములు కోల్పోతున్న  రైతులకు సంబంధించిన వివరాలను భూమిరాశి పోర్టల్‌లో అప్​లోడ్​ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే పరిహారం అందుతుంది. భారత్​మాల పరియోజన ఫేస్​-1లో భాగంగా రీజినల్​రింగ్​రోడ్డు (ట్రిపుల్​ఆర్​) ఉత్తర భాగం యాదాద్రి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్లు నిర్మాణం కానుంది.  జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్​ మండలాల్లో 1795 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. 

ఈ భూసేకరణ కోసం గతంలోనే గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేశారు.​ భూ సేకరణ కోసం తుర్కపల్లి, భువనగిరి, చౌటుప్పల్​ ‘కాలా’లు ఏర్పాటు చేశారు. భూ సేకరణను వ్యతిరేకిస్తూ భువనగిరి కాలా పరిధిలోని రాయగిరి సహా ఇతర గ్రామాల రైతులు సర్వే నిర్వహించకుండా అడ్డుకున్నారు. భువనగిరి మినహా తుర్కపల్లి, చౌటుప్పల్​ ‘కాలా’  పరిధిలో సర్వే పూర్తి అయింది.

1288 ఎకరాలకు అవార్డు ఓకే

భూ సేకరణ కోసం నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా 2022లో గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో 'రిజిస్ట్రేషన్​ అండ్​ స్టాంప్'​ డిపార్ట్​మెంట్  పేర్కొన్న మార్కెట్​ వ్యాల్యూ ప్రకారం భూములు కోల్పోతున్న వారికి ‘అవార్డు’కు నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా ఒప్పుకుంది. తుర్కపల్లి, యాదగిరిగుట్ట, వలిగొండ, చౌటుప్పల్​ మండలాల పరిధిలోని 18 గ్రామాల్లో 1288.35 ఎకరాలను సేకరించడానికి ‘అవార్డు’ నిర్ణయించింది. 

భూమిరాశి పోర్టల్​లోకి

అవార్డు ప్రక్రియ  పూర్తయిన తర్వాత భూమి కోల్పోతున్న వారికి నోటీసులు జారీ చేశారు.  తమ భూములకు సంబంధించిన డిటైల్స్​తో పాటు బ్యాంక్​ వివరాలు కూడా అందించారు. అయితే భూమి రాశి పోర్టల్​ అందుబాటులోకి రాకపోవడంతో వారి వివరాలు అప్​లోడ్​ చేయడంలో ఆలస్యమైంది. తాజాగా అందుబాటులోకి రావడంతో భూములు కోల్పోతున్న వివరాలను వేగంగా అప్​లోడ్​ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూ సేకరణ 'కాలా' ఆఫీసర్​ భూములు కోల్పోతున్న వారి అకౌంట్లలోకి అమౌంట్​ జమ చేస్తారు. 

2489 మందికి రూ. 532 కోట్లు

ట్రిపుల్​ ఆర్​ కోసం తుర్కపల్లి, యాదగిరిగుట్ట, వలిగొండ చౌటుప్పల్​ పరిధిలో 2489 మంది అగ్రికల్చర్​ ల్యాండ్స్​తో పాటు ఇండ్ల స్థలాలను కోల్పోతున్నారు.  ఆయా మండలాల్లో అతి తక్కువగా ఎకరానికి రూ. 3,37,500 ఉండగా మూడు రేట్లు కలిపి ఇస్తే దాదాపు రూ. 10.12 లక్షలు, అతి ఎక్కువగా రూ. 19.06 లక్షలుగా ఉండగా రూ. 57 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. ఇండ్ల స్థలాల విషయానికొస్తే గజానికి రూ. 800  నుంచి రూ. 10 వేల వరకూ గవర్నమెంట్​ మార్కెట్​ వ్యాల్యూ ఉంది. ల్యాండ్​ విలువ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో భూమిని కోల్పోతున్న వారికి మూడు రెట్లు , మున్సిపాలిటీ ప్రాంతాలకు చెందిన వారికి రెండు రెట్ల పరిహారం అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా 2489 మందికి రూ. 532 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

అగ్రికల్చర్​ ల్యాండ్​ పరిహారం చెల్లింపు విధానం ఇలా... 
మార్కెట్​ ధర(ఎకరానికి)    గ్రామీణ ప్రాంతాల్లో చెల్లింపు    పట్టణ ప్రాంతాల్లో చెల్లింపు
రూ.  3,37,500                          రూ.10,12,500                               రూ. 6,75,000
రూ. 19,06,000                         రూ. 57,18,000                              రూ, 38,12,000