సుప్రీంకోర్టు స్పష్టీకరణతో వొడాఫోన్ ఐడియా షేర్ జంప్.. ఇంట్రాడేలో 10 శాతం అప్

సుప్రీంకోర్టు స్పష్టీకరణతో వొడాఫోన్ ఐడియా షేర్ జంప్.. ఇంట్రాడేలో 10 శాతం అప్

వొడాఫోన్ ఐడియా కంపెనీ షేర్లు ఇంట్లాడేలో ఏకంగా 10 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. దీనికి కారణం సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టీకరణే. టెలికాం కంపెనీ అడిగిన అదనపు AGR బకాయిలపై మాఫీతో పాటు అన్ని బకాయిలను పునః మూల్యాంకనం చేసే అవకాశం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా పెట్టుబడిదారుల్లో ఎగిసిన ఉత్సాహంతో షేర్ల కొనుగోలుకు దిగారు సోమవారం.  

రూ.2 లక్షల కోట్లకు బకాయిలు..

వొడాఫోన్ ఐడియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అడిగిన అదనంగా రూ.9,450 కోట్ల AGR బకాయిలను సవాల్‌ చేసింది. ప్రధానంగా వడ్డీ, జరిమానాలపై మన్నింపులను టెరికాం సంస్థ కోరింది. కంపెనీకి మొత్తం సుమారు రూ.83,400 కోట్ల AGR బకాయిలు ఉండగా.. వడ్డీతో కలిపి మొత్తం ప్రభుత్వానికి చెల్లించాల్సిన మెుత్తాలు ఏకంగా రూ.2 లక్షల కోట్ల వరకు పెరిగాయి. మార్చి 2026 నుంచి ప్రతి సంవత్సరం సుమారు రూ.18వేల కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉంది.  

వొడాఫోన్ ఐడియా ఫిబ్రవరి 2020లో జారీ చేసిన ‘Deduction Verification Guidelines’ ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరానికి ముందు వరకు ఉన్న అన్ని బకాయిలను సమగ్రంగా పునః మూల్యాంకనం చేయాలని కోరినట్లు న్యాయమూర్తి గుర్తించారు. గతంలో కోర్టు ఈ అంశాన్ని పాక్షికంగా మాత్రమే అనుమతించినందున కంపెనీ సమీక్ష పిటిషన్‌ వేసింది.  

కంపెనీ కొనుగోలుకు యూఎస్ సంస్థ..

దీనితోపాటు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ‘టిల్ల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్‌’ (TGH) వొడాఫోన్ ఐడియాలో రూ.4-6 బిలియన్ల పెట్టుబడి పెట్టి ఆపరేషనల్ కంట్రోల్‌ తీసుకోవాలన్న చర్చలు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ పెట్టుబడి కేవలం ప్రభుత్వం అన్ని బకాయిలపై సమగ్ర ప్యాకేజీ ప్రకటిస్తే మాత్రమే ముందుకు సాగుతుందని సమాచారం.  ఈ ట్రాన్సాక్షన్ పూర్తైతే టిల్ల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్‌ ప్రమోటర్ హోదాలోకి వస్తుంది. దీంతో ప్రస్తుత ప్రమోటర్లైన ఆదిత్య బిర్లా గ్రూప్‌, యూకే వొడాఫోన్ హోల్డింగ్ తగ్గే అవకాశం ఉంది. కంపెనీలో ప్రస్తుతం ప్రభుత్వ వాటా 48.99 శాతం ఉండగా.. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు 9.50 శాతం, వొడాఫోన్ కు 16.07 శాతం వాటా ఉంది.