కొండకోనల్లో కోటి సీడ్ బాల్స్

కొండకోనల్లో కోటి సీడ్ బాల్స్

హెలిక్యాప్టర్ ద్వారా చల్లాలని నిర్ణయం
పాలమూరు జిల్లాలో వినూత్న ప్రయోగం
సీడ్ బాల్స్ తయారీలో లక్షమంది మహిళలు

మహబూబ్ నగర్, వెలుగు: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో వినూత్నంగా చేపట్టాలని ఆఫీసర్లు నిర్ణయించారు. మహబూబ్ నగర్లోని మయూరి పార్క్, పిల్లలమర్రి ప్రాంతం, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇందుకోసం మహిళా సంఘాలతో కోటి సీడ్ బాల్స్ తయారు చేయిస్తున్నారు. హెలీక్యాప్టర్ద్ ద్వారా సీడ్ బాంబింగ్ చేస్తామని, ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరవుతారని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తాజాగా ప్రకటించారు.

సీడ్ బాల్స్ తయారీలో మహిళలు..
మహబూబ్ నగర్ జిల్లాలో సీడ్ బాంబింగ్ పై జిల్లా కలెక్టర్ వెంకట్రావు మొదటి నుంచీ ఇంట్రెస్ట్‌ ‌‌చూపుతున్నారు. ఎలాగైనా కోటి సీడ్ బాల్స్ తయారుచేసి, కొండకోనలు, అటవీప్రాంతాల్లో చల్లాలని నిర్ణయించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హన్వాడ మండలం పెద్ద దర్పల్లి గ్రామం కేంద్రంగా వెయ్యి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లోని లక్ష మంది మహిళా సభ్యులకు సీడ్ తయారీ బాధ్యత అప్పగించారు. రాగి, మర్రి, మేడి, చింత, వేప, జువ్వి, నల్లతుమ్మ తదితర రకాలకు చెందిన 100 విత్తన సంచులను తెప్పించి, అప్పగించారు. వీరంతా పది రోజులుగా రూ.10 లక్షల ఖర్చుతో కోటి సీడ్ బాల్స్ తయారుచేస్తున్నారు. జూన్ 27 నుంచి తయారీ ప్రక్రియ మొదలుకాగా, మరో మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో సిద్ధం కానున్నాయి.

ఇలా చేస్తున్నారు..
సీడ్ బాల్ తయారీలో 70 శాతం ఎర్రమట్టి, ఆవుపేడ, బెల్లం, శనగపిండి, తదితర మిశ్రమాన్ని 30శాతం చొప్పున వాడుతున్నారు. ఈ ముద్దలో విత్తనం పెట్టి బాంబింగ్ కోసం రెడీ చేస్తున్నారు. ఇలా తయారైన బాల్స్ ను ప్రత్యేక గోనె సంచులను పరిచి ఆరబెడుతున్నారు. ఏ బాల్స్ ఏ రకం విత్తనాలవో తెలిసేందుకు గుర్తుగా ఆయా చెట్ల కొమ్మలను ఉంచుతున్నారు.

సీడ్ బాంబింగ్ ఎందుకంటే..
దట్టమైన అటవీప్రాంతాల్లో, ఎగుడు దిగుడు ప్రదేశాల్లో, గుట్టలపైన మొక్కలు నాటడం చాలా కష్టం. అలాంటి ప్రదేశాల్లో సీడ్ బాంబింగ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈజిప్టు, జపాన్ లాంటి దేశాల్లో ఈ పద్ధతి ఎంతగానో విజయవంతమవుతోంది. మహబూబ్ నగర్ సమీపంలోని మయూరి పార్క్, పిల్లలమర్రి ప్రాంతం, గుట్టలపై, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాల్లో గుంతలు తవ్వి, మొక్కలు నాటడం సాధ్యం కావడం లేదు. అందువల్లే జిల్లా ఆఫీసర్లు సీడ్ బాంబింగ్ పై దృష్టి పెట్టారు. గతంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ సీడ్ బాంబింగ్ చేసినా ఇంత పెద్ద ఎత్తున చేయడం, అందులోనూ హెలీ క్యాప్టర్ ద్వారా చల్లడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని ఆఫీసర్లు అంటున్నారు.

For More News..

టిక్‌టాక్‌ బ్యాన్‌తో.. హైదరాబాద్ యాప్ కు జోష్

వీడియో: పానీ పూరీ కోసం ఏటీఎం

దుకాణాలు, సూపర్ జజార్లలో ఎక్స్ పైరీ ఫుడ్ ఐటమ్స్

కరోనా డేంజర్లో హైదరాబాద్