కంపెనీల మెలికతో ‘సీడ్’ పత్తి రైతు విలవిల!.. గతేడాది బకాయిలు రూ.200 కోట్లు పెండింగ్

 కంపెనీల మెలికతో  ‘సీడ్’ పత్తి రైతు విలవిల!.. గతేడాది బకాయిలు రూ.200 కోట్లు పెండింగ్
  • ఈ ఏడాది చెల్లింపులకు డిసెంబర్ గడువు
  • పెట్టుబడి సాయం అందక తగ్గిన దిగుబడి
  • ఎకరాకు 400 నుంచి 250 ప్యాకెట్లకు పతనం
  • ధరల తగ్గింపుతో అటు రైతులు, ఇటు ఆర్గనైజర్లు బలి

గద్వాల, వెలుగు : నడిగడ్డ ప్రాంతంలో కుటీర పరిశ్రమగా మారిన సీడ్ పత్తి సాగు ప్రస్తుతం కంపెనీల మితిమీరిన నిబంధనలు, నిర్లక్ష్యంతో దెబ్బతింటోంది. సాధారణంగా జనవరిలో శాంపిల్స్ సేకరించి ఏప్రిల్ నాటికి రైతులకు నగదు చెల్లించాల్సి ఉండగా, ఈ ఏడాది సీడ్ కంపెనీలు కొత్త మెలిక పెట్టాయి. పండించిన పంటకు సంబంధించి 2026 డిసెంబర్ నెలలోనే డబ్బులు  ఇస్తామనడంతో అటు రైతులు, ఇటు ఆర్గనైజర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 

సీడ్ కంపెనీల మొండివైఖరి.. 

సీడ్ కంపెనీల మొండివైఖరితో పాత బకాయిల సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. 2023–-24 సీజన్‌ లో సుమారు రూ.వేయి కోట్ల లావాదేవీలు జరగగా.. ఇంకా రూ.200 కోట్లు రైతులకు, ఆర్గనైజర్లకు అందాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం  దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రావడంలేదు. గతేడాది డబ్బులు రాకపోవడంతో ఆర్గనైజర్లు ఈసారి రైతులకు పెట్టుబడి సాయం చేయలేకపోయారు. దీంతో సకాలంలో పెట్టుబడి అందక పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది.

ఖర్చులు పెరిగింది.. దిగుబడి తగ్గింది..

ఈసారి సీడ్​ పత్తి సాగు ఖర్చులు పెరిగినప్పటికీ, దిగుబడి మాత్రం గణనీయంగా తగ్గడం రైతును కుంగదీస్తోంది. గతంలో ఎకరాకు సగటున 400 ప్యాకెట్ల దిగుబడి రాగా, ఈ ఏడాది అది కేవలం 250 నుంచి 300 ప్యాకెట్లకు పరిమితమైంది. దీనికి తోడు కంపెనీలు గతేడాది కంటే ఈసారి ధరలను తగ్గించడంతో రైతులకు కష్టాలు పెరిగాయి. జీఎంఎస్​ ప్యాకెట్లపై  రూ.100 నుంచి రూ.200 వరకు ధర తగ్గించడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. అటు దిగుబడి తగ్గి, ఇటు ధర కూడా పడిపోవడంతో సాగు చేసిన రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

సీడ్ వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదం..  

ప్రస్తుతం పండించిన గింజల శాంపిల్స్ తీసే విషయంలో కంపెనీలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్గనైజర్లతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుని, మే, జూన్ నాటికి రైతులకు అందాల్సిన చెల్లింపులను డిసెంబర్ వరకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. కంపెనీల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే సీడ్ వ్యవస్థ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి పాత బకాయిలు ఇప్పించడంతో పాటు, ప్రస్తుత సీజన్ చెల్లింపులు త్వరగా జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.

రైతులకు నష్టం జరగనివ్వం

ఎట్టి పరిస్థితిలో సీడ్ పత్తి రైతులకు నష్టం జరగనివ్వం. సీడ్​ కంపెనీలు ఇస్తాయా, ఆర్గనైజర్లు ఇస్తారా వారి ఇష్టం. రైతులకు మాత్రం డబ్బులు ఇన్ టైంలో ఇవ్వాల్సిందే. ఎంత సీడ్ ఇచ్చాం.. అనేది గతంలో లెక్కలు లేకుండే.. కానీ ఇప్పుడు మాత్రం పక్కాగా లెక్కలు తీసుకొని రైతులకు అన్యాయం జరగకుండా చూస్తం. – లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్ గద్వాల