డ్రోన్లతో విత్తనాలు నాటుతున్రు

డ్రోన్లతో విత్తనాలు నాటుతున్రు

2028 నాటికి100 కోట్ల మొక్కలు పెంచుతరట
‘ఫ్లాష్ ఫారెస్ట్’ సృష్టికి కెనడా ఇంజనీర్ల యత్నం

ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎన్ని చెట్లు చనిపోతున్నాయో తెలుసా? సుమారుగా13 వేల కోట్లు! మరి వీటి స్థానం భర్తీ చేసేటందుకు కొత్తగా ఎన్ని మొక్కలు పుడుతున్నాయో తెలుసా? జస్ట్ సగం కూడా లేవట! అందుకే.. అడవులను వేగంగా పెంచాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉందని గుర్తించిన కెనడా ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ లు బ్రైస్ జోన్స్, ఆండ్రూ లాడర్, జోషువా కాలఫటోల టీం సరికొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది. ‘ఫ్లాష్​ఫారెస్ట్’ అనే పేరు పెట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్లతో విత్తనాలను నాటుతున్నారు. 2028 నాటికి 100 కోట్ల విత్తనాలు నాటి, వాటిని మొక్కలుగా మొలిచేలా చేయడమే తమ టార్గెట్ అని వాళ్లు చెప్తున్నారు.

విత్తనాలు నాటేది ఇలా..

మామూలుగా మనుషులతో విత్తనాలు నాటాలంటే ఎక్కువ టైంలో తక్కువ పనైతది. ఎక్కువ మంది జనాలు దాని కోసం పనిచేయాల్సి ఉంటుంది.  దాంతో పాటు ఖర్చూ ఎక్కువే. అందుకే వాళ్లు డ్రోన్ టెక్నాలజీపై ఫోకస్ పెట్టారు. ముందుగా వాళ్లకు కావాల్సిన రకరకాల మొక్కల విత్తనాలను సెలెక్ట్​ చేసుకుంటారు.  వాటిని మట్టి, ఇతర న్యూట్రియెంట్స్ కలిపిన ఒక                 ముద్దలో పెడతారు. ఆ ముద్దలను ఉండలుగా చుట్టి సీడ్ బాల్స్​గా మారుస్తారు. ఈ సీడ్ బాల్స్​ను డ్రోన్ ల ద్వారా పై నుంచి జార విడుస్తారు. దీంతో వానలు పడగానే సీడ్ బాల్స్ మొలకెత్తుతాయి. వాటి చుట్టూ ఉన్న మట్టి, న్యూట్రియెంట్స్ సాయంతో ఏడెనిమిది నెలల వరకూ మొక్కలు బతకగలవు. ఆలోపు వేర్లు పుట్టి, నేలలో బాగా పాతుకుపోతాయి.  ఇలా.. డ్రోన్లతో ఈజీగా మొక్కలు పెంచొచ్చని వీరు అంటున్నారు.

ఫ్లాష్​ఫారెస్ట్ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా గత ఆగస్టులో ప్రారంభించారు. ఇప్పటివరకూ 3,100 విత్తనాలను నాటారు. తమ ఐడియా సక్సెస్ అయిందని, ఇకపై భారీ ఎత్తున డ్రోన్లను రంగంలోకి దించేందుకు ‘ఫ్లాష్​ ఫారెస్ట్’ వెబ్ సైట్ ద్వారా ఫండ్ రైజింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టామని బ్రైస్ జోన్స్ వెల్లడించారు. ఒక మనిషే పది డ్రోన్లను కంట్రోల్ చేయవచ్చని, ఒక్కో డ్రోన్ ఒక సెకనుకు ఒక విత్తనాన్ని జారవిడుస్తుందన్నారు. మామూలుగా మొక్కలు పెంచి, నాటేందుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే ఈ పద్ధతిలో అయ్యే ఖర్చు ఐదో వంతు కూడా ఉండదన్నారు. రకరకాల మొక్కలనూ నాటేందుకు వీలవుతుంది కాబట్టి ఫారెస్ట్ ఎకో సిస్టం మెరుగుపడుతుందని చెప్తున్నారు.