అనాథలకి అమ్మానాన్న లేని లోటు తీర్చలేనిది. వాళ్లని ప్రేమగా పిలిచేవాళ్లు, దగ్గరికి తీసుకునేవాళ్లు ఉండరు. నా అనేవాళ్లు లేకుండా బతకడం ఎంత కష్టమో భర్త, కొడుకును పోగొట్టుకున్న ఆమెకి బాగా తెలుసు. అందుకే, అనాథ పిల్లల కష్టాలు చూసి చలించిపోయిందామె. అమ్మలా వాళ్లని అక్కున చేర్చుకోవాలి అనుకుంది. అనుకోవడమే కాదు అలాంటి వాళ్లకోసం హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ‘కృప చిల్డ్రన్ హోమ్’ నడుపుతోంది.
ఆమె పేరు అలుగోజి పద్మావతి. దాదాపు 17 ఏండ్లుగా అనాథ పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆమె తల్లి మనసు ఇది... “షాపూర్ నగర్లో నలుగురు అనాథ పిల్లలతో 2005లో ‘కృప చిల్డ్రన్స్ హోమ్’ మొదలు పెట్టాను. ఆ ఏడాది 57 మంది అనాథల్ని చేరదీశాను. అంతమంది పిల్లల తిండి, ఇతర ఖర్చులకి డబ్బులు చాలకపోవడంతో నా ఒంటిమీది బంగారం అమ్మేశాను. మా అబ్బాయి కూడా కొంత డబ్బు సాయం చేయడంతో ఇబ్బంది ఉండేది కాదు. మగపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో, ఐదుగురు ఆడపిల్లల్ని మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదివించాం. మా దగ్గర పెరిగిన పిల్లల్లో కొందరు చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర11మంది పిల్లలు ఉన్నారు. వీళ్లలో నలుగురు ఇంటర్ చదువు తున్నారు. ఆడపిల్లలకి టైలరింగ్ నేర్పించాలని అనుకుంటున్నా. ప్రతి ఏడాది నవంబర్ 11న పిల్లల బర్త్ డే చేస్తాను. అప్పుడు వాళ్లకి బట్టలు కొంటాను. మా సంస్థ గురించి తెలిసి కొందరు నెలనెలా 50 కిలోల బియ్యం పంపిస్తున్నారు. మరికొందరేమో నిత్యావసరాలు ఇస్తున్నారు. కొందరైతే తమ పిల్లల బర్త్‌డేని మా ఆశ్రమంలో చేసి, పిల్లలకు చాక్లెట్లు, స్వీట్లు పంచుతారు.
వీళ్లలో కొడుకుని చూసుకుంటూ...
మా సొంతూరు పశ్చిమగోదావరి జిల్లాలోని కాకర్లమూడి. నేను టెన్త్ వరకే చదివాను.13 ఏండ్లకే పెండ్లి అయింది. మా ఆయన ఇంజనీర్. ఆయనకి హైదరాబాద్‌లో జాబ్ రావడంతో ఇక్కడికి వచ్చేశాం. మాకు ఇద్దరు పిల్లలు. అయితే, అనారోగ్యంతో మా ఆయన చనిపోయాడు. మా అబ్బాయి హైటెక్ సిటీలో జాబ్ చేసేవాడు. ఆఫీస్ లేనప్పుడు అనాథాశ్రమం పనుల్లో నాకు సాయం చేసేవాడు. వాడు 2013లో హార్ట్ఎటాక్ వచ్చి చనిపోయాడు. ఎంతో గారాబంగా పెంచిన కొడుకు దూరమవడంతో చాలా బాధపడ్డాను. ఆ బాధ నుంచి తేరుకుని, మళ్లీ మామూలు మనిషిని అయ్యానంటే దానికి కారణం ఈ పిల్లలే. అందుకే, ఈ పిల్లల్లోనే నా కొడుకును చూసుకుంటున్నా. పిల్లలందరూ నన్ను ‘అమ్మమ్మ’ అని పిలుస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా తర్వాత ఈ ఆశ్రమం బాధ్యతల్ని నా కూతురు, అల్లుడికి అప్పగించాలి అనుకుంటున్నా. ఎవరైనా డొనేషన్స్ ఇస్తే మరింత మంది అనాథ పిల్లల్ని చేరదీయాలని ఉంది’’. ::: సంతోష్ బొందుగుల
