రాష్ట్రాలపై కేంద్రం ఆర్థిక దాడికి పాల్పడుతోంది : మంత్రి సీతక్క

రాష్ట్రాలపై కేంద్రం ఆర్థిక దాడికి పాల్పడుతోంది : మంత్రి సీతక్క
  •     రాష్ట్రాలకు దక్కాల్సిన  పన్ను ఆదాయానికి గండి: సీతక్క

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక దాడికి పాల్పడుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ సంక్షేమ బాధ్యతలను తగ్గించుకుంటూ, ఆ భారా న్ని రాష్ట్రాలపై మోపుతోందని మండిపడ్డారు. సెస్‌లు, సర్‌ చార్జీల పేరుతో రాష్ట్రాలకు దక్కాల్సిన పన్ను ఆదాయానికి కేంద్రం గండి కొడుతోందని ఆరోపించారు. 

దశాబ్దాలుగా కేంద్ర నిధులతో అమలైన పథకాల నిర్వ హణ భారాన్ని ఇప్పుడు రాష్ట్రాలపై నెట్టేస్తుండటంతో ఆర్థికంగా కుదేలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. గతంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇస్తే, రాష్ట్రాలు కేవలం 10 శాతం మాత్రమే భరించేవని, ఇప్పుడు కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించి, రాష్ట్రాల వాటాను 40 శాతానికి పెంచి అదనపు భారం మోపిందని వివరించారు. 

సర్వశిక్ష అభియాన్, నేషనల్ హెల్త్ మిషన్, మిడ్​డే మీల్స్, పీఎం గ్రామీణ సడక్ యోజన, ఐసీడీఎస్, పీఎం ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి పథకాలన్నీ ఇప్పుడు రాష్ట్రాలకు భారంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉపాధి హామీ పథకాల్లోనూ కేంద్రం కోతలు విధిస్తోందని విమర్శిం చారు. గతంలో 100 శాతం కేంద్ర నిధులతో సాగిన గ్రీన్ రివల్యూషన్ కృషోన్నతి యోజన ఇప్పుడు 60:40 నిష్పత్తికి మారిందన్నారు. పీఎం ఫసల్ బీమా పథకంలో రాష్ట్రాల వాటా ఏకంగా 75 శాతానికి చేరిందని గుర్తుచేశారు.