- మాగంటి తల్లి ఆరోపణలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి: సీతక్క
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు హడావుడి చూస్తే బీఆర్ఎస్ ఓటమి ఖాయమైందని మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని కేటీఆర్ మోసం చేశారని, ఆ తల్లి ఆవేదన చూస్తే కేటీఆర్ ఎంత మోసకారో అర్థమవుతుందన్నారు. సొంత చెల్లి, మాగంటి తల్లి మాటల్లో కేటీఆర్ మోసం బయటపడుతుందన్నారు. 91 ఏండ్ల వృద్ధురాలని కూడా చూడకుండా మాగంటి తల్లిని అవమానించారని, ఆ తల్లి ఆరోపణలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు నిశ్శబ్ద విప్లవమని ప్రగల్భాలు పలుకుతున్నారని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవమన్నారని, ఆ నిశ్శబ్ద విప్లవమే మిమ్మల్ని నిండా ముంచిందని ఎద్దేవా చేశారు.
నిన్నటి వరకు విషాదంలో ఉన్న హరీశ్‌రావు హడావుడిగా బయటకు వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే 24 గంటలు గడవకముందే హరీశ్‌రావు ప్రచారం చేస్తున్నారని, ఓటమి తప్పదని తెలిసి అవస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. వైన్, మైన్, ల్యాండ్, సాండ్ అన్ని మాఫియాలతో తెలంగాణలో విధ్వంస పాలన చేశారని ఫైర్ అయ్యారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.
