వీబీ జీ రామ్‌‌ జీపై ఏం చేద్దాం!..ప్రత్యామ్నాయాలపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష

వీబీ జీ రామ్‌‌ జీపై ఏం చేద్దాం!..ప్రత్యామ్నాయాలపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
  • జులై 1 నుంచి అమల్లోకి కొత్త చట్టం  
  • ఈ చ‌‌ట్టంతో జ‌‌రిగే న‌‌ష్టాన్ని భ‌‌ర్తీ చేసేలా చర్యలు 
  • తీసుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ- రామ్‌‌ జీ చట్టం అమలులోకి రానున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర  ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలపై సమాలోచనలు చేస్తోంది. సోమవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు.

సమావేశానికి స్పెష‌‌ల్ చీఫ్ సెక్రట‌‌రీ దాన‌‌కిశోర్, క‌‌మిష‌‌న‌‌ర్ దివ్య దేవ‌‌రాజ‌‌న్, స్పెష‌‌ల్ క‌‌మిష‌‌న‌‌ర్ శ్రీల‌‌క్ష్మి, జాయింట్ క‌‌మిష‌‌న‌‌ర్ న‌‌ర్సింహులు, లా సెక్రటరీ పాపిరెడ్డి, వ్యవ‌‌సాయశాఖ క‌‌మిష‌‌నర్ గోపి, అడిష‌‌న‌‌ల్ క‌‌మిష‌‌న‌‌ర్ విజ‌‌య్ కుమార్, స్పెష‌‌ల్ జీపీ రాహుల్ రెడ్డి, స‌‌బ్జెక్ట్ ఎక్స్​ఫర్ట్​ర‌‌క్షిత, ఇత‌‌ర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీబీ జీ రామ్‌‌ జీ చట్టంలోని ప్రధాన నిబంధనలు, వాటి ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం, గ్రామీణ ఉపాధిపై ప్రభావం తదితర అంశాలపై చర్చించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పోలిస్తే కొత్త చట్టంలో వ్యవసాయ సీజన్లలో 60 రోజులపాటు ఉపాధి పనులకు విరామం ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రాలకు ముందుగా నిర్ణయించిన నిర్ణీత‌‌ నిధుల కేటాయింపు విధానం అమలు చేయడం, కేంద్ర రాష్ట్ర వ్యయ భాగస్వామ్యాన్ని 60:40 నిష్పత్తికి మార్చడం వంటి అంశాలు  ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

కర్నాటక, కేరళ, జార్ఖండ్ ​రాష్ట్రాల్లో అధ్యయనం.. 

వీబీ జీ రామ్‌‌ జీ చట్టంపై కర్నాటక, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. గ్రామీణ ఉపాధి హక్కు, రాష్ట్రాల ఆర్థిక భారం, సమాఖ్య స్ఫూర్తికి సంబంధించిన అంశాలపై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లోని పేదల ఉపాధి, జీవనోపాధి ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.

తెలంగాణలో లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హామీ పథకం జీవనాధారంగా మారిందని తెలిపారు. కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరించబోదని స్పష్టం చేశారు. కొత్త చ‌‌ట్టంతో జ‌‌రిగే న‌‌ష్టాన్ని భ‌‌ర్తి చేసేలా చర్యలు చేప‌‌డ‌‌తామని మంత్రి పేర్కొన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు