- రాష్ట్రాలతో సంప్రదించకుండా స్కీమ్ ప్రారంభించడం సరికాదు: సీతక్క
- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు సూచించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త ఉపాధి హామీ పథకం ‘వీబీ జీ రామ్-జీ’ అమలుపై మంత్రి సీతక్క అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపకుండా.. 20 రోజుల నోటీసుతో కొత్త పథకాన్ని అమలు చేయాలని చెప్పడం సరికాదని అన్నారు. మంగళవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీతక్క పాల్గొని తెలంగాణ ప్రభుత్వ వాదనను వినిపించారు.
ఉపాధి హామీ పథకం స్థానంలో వస్తున్న కొత్త విధానంలో వ్యవసాయ సీజన్ పేరుతో 60 రోజులపాటు పనులను నిలిపివేయాలనే నిబంధనను సీతక్క తప్పుపట్టారు. ప్రస్తుతం అమలవుతున్న పనులన్నీ పూర్తయ్యేదాకా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిబంధనల ప్రకారమే 100 శాతం నిధులను కేంద్రమే భరించాలని డిమాండ్ చేశారు. కొత్త పథకంలో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్య నిధుల విధానంతో రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల భవన నిర్మాణాల వంటి పనులు కొనసాగుతున్నాయని, ఇలాంటి సమయంలో కొత్త విధానానికి మారాలంటే కనీసం 2 నెలల టైం కావాలని సీతక్క కోరారు.
